Cyclone Fengal: ఏపీ వైపు తుఫాను దూసుకొస్తోంది. పలు జిల్లాలపై ప్రభావం చూపనుంది. ఈనెల 30 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తరాంధ్ర పై కూడా ప్రభావం ఉండనుంది. ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే ఈ తుఫాన్ కు ఫెంగల్ అని పేరు పెట్టారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారింది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తోంది. దీని ప్రభావం తమిళనాడు తో పాటు ఏపీ ఫై ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో ఈరోజు నుంచి వర్షాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 1 వరకు వానలు పడనున్నాయి.
* ఆ జిల్లాలపై ప్రభావం
తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పైన తుఫాను ప్రభావం కొనసాగనుంది. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోవైపు రైతులు వరి కోతలు నిలిపివేయడంతో పాటు ధాన్యం సంరక్షించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులను అప్రమత్తం చేశారు.
* గంటకు 13 కిలోమీటర్ల వేగంతో
వాయుగుండం ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు గుర్తించారు. వాయుగుండం తుఫానుగా మారుతుండడంతో ఏపీలోని పలు జిల్లాల పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు తుఫాను హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా అప్రమత్తం అయ్యింది. గత అనుభవాల దృష్ట్యా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపింది.విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.