India women vs south africa women : క్రికెట్ నుంచి వాలిబాల్ దాకా అన్ని క్రీడల్లో ఏపీ నుంచి క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచ వేదికల ముందు రెపరెపలాడిస్తున్నారు. అయితే ఇంతటి ఖ్యాతి ఉన్నప్పటికీ ఏపీ రాష్ట్రానికి ఒక క్రీడా పాలసీ అనేది లేకుండా పోయింది. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ఎంతటి అక్రమాలు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో అద్భుతమైన ప్లేయర్లున్న నేపథ్యంలో.. వారికి మెరుగైన అవకాశాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా వర్ధమాన మహిళా ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇటీవల కాలంలో ఏపీ స్పోర్ట్స్ పాలసీ ఎలా ఉండాలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇందులో భాగంగా మిథాలీ రాజ్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్ తో భేటీ అయ్యారు . వారి మదిలో ఉన్న అంశాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లకు ఎలాంటి అవకాశాలు కల్పించాలో వారి దగ్గర నుంచి తెలుసుకున్నారు. దాని ఆధారంగానే క్రీడ పాలసీ రూపొందిస్తామని నారా లోకేష్ వెల్లడించారు. దీనిని బట్టి నారా లోకేష్ ఏపీలో క్రీడాకారుల భవిష్యత్తు కోసం ఎంతలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇటీవల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, భారత మహిళా జట్లు విశాఖపట్నం వేదికగా పోటీపడ్డాయి. ఆ మ్యాచ్ ను వీక్షించిన నారా లోకేష్.. మైదానాలలో కల్పించాల్సిన సదుపాయాల గురించి దిగ్గజ క్రీడాకారులతో కలిసి చర్చించారు. వాస్తవానికి ఏపీ చరిత్రలో ఒక మంత్రి ఇలా క్రికెట్ మ్యాచ్ చూడడం ఒక విశేషం అయితే.. ప్లేయర్లతో నేరుగా మాట్లాడడం మరొక విశేషం.

అయితే క్రీడా పాలసీ రూపొందించే విషయంలో ఏపీ ప్రభుత్వం అక్కడితోనే ఆగిపోలేదు. క్రీడాకారులకు కావలసిన సదుపాయాలు.. కల్పించాల్సిన సౌకర్యాల గురించి చర్చిస్తూనే ఉంది. తాజాగా మహిళల వన్డే వరల్డ్ కప్ కొనసాగుతున్న నేపథ్యంలో.. టీమిండియా మహిళల జట్టు ఫైనల్ వెళ్లి దక్షిణాఫ్రికా తో తలపడుతున్న క్రమంలో.. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు వినూత్నంగా ఆలోచించారు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జన సమర్థమైన ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఆసక్తిగా మ్యాచ్ చూస్తున్నారు. దీనివల్ల ఆడవాళ్లు క్రీడారంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

అంతేకాదు క్రికెట్ ను ఒక వ్యాపకంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు ఏర్పాటుచేసిన బిగ్ స్క్రీన్ ల వద్ద ప్రజల కేరింతలు కొడుతున్నారు. ఏక స్వరంతో టీమ్ ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా వర్ధమాన యువతుల ఆలోచన విధానం మారుతుందని.. రొటీన్ చదువులే కాకుండా క్రీడల వైపు వారు వెళ్తారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ప్రజా ప్రతినిధులు చేసిన ఈ ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు మెచ్చుకుంటున్నారు. గతంలో ఏ ప్రజా ప్రతినిధి కూడా ఇలా చేయలేదని వారు చెబుతున్నారు.

