CPI Ramakrishna : ‘ మాజీ సీఎం జగన్ భార్య భారతి క్రైస్తవురాలు కాబట్టి జగన్ తిరుమలకు ఎలా వెళతారని టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనోవా కూడా క్రైస్తవురాలే కాదు.. మరి ఆయన ఎలా తిరుమల వెళ్తున్నారు..’ ఇదీ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేవనెత్తిన లాజిక్కు.. ఈ లాజిక్కు లేవనెత్తిన రామకృష్ణ జగన్ ని ,పవన్ ని తిరుమలకు వెళ్ళొద్దని చెప్పడంలేదు.. ఆయన కోరుతుందల్లా మతాన్ని, రాజకీయల్ని కలగలపవద్దని.. రాజకీయాలు వేరు, మతాలు, విశ్వాసాలు వేరు అని మాత్రమే.. తిరుమల వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకొని ఏపీలో రాజకీయాలు కొనసాగడం దురదృష్టకరమని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం గారూ..లడ్డూ వివాదాన్ని ఆపండి
తిరుమల-తిరుపతి లడ్డూ వివాదానికి స్వస్తి పలకాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం చంద్రబాబుకి, ఇతర ప్రభుత్వ పెద్దలకి సూచించారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇప్పటికే సిట్ దర్యాప్తుకు ఆదేశించారని, నివేదిక వచ్చాక దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తిరుమల పవిత్రత కాపాడేలా చర్యలుండాలన్నారు. దీన్ని వదిలేసి లడ్డూ చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇది తగదని హితువు పలికారు. సీఎం, మాజీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, రాజకీయనేతలంతా తిరుమల లడ్డూ, స్వామివారి దర్శనం పైనే వ్యాఖ్యానాలు చేస్తున్నారని తక్షణం వీటిని ఆపేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని సూచించారు.
■ మాజీ సీఎం జగన్ కి అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకు..? – రామకృష్ణ
వైఎస్ జగన్ సీఎం గా వున్నప్పుడు ఐదేళ్లపాటు తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అప్పుడు అధికారిక లాంఛనాలతోనే ఆయన స్వామివారిని దర్శించుకున్నారని, అప్పుడు ఎలాంటి డిక్లరేషన్ అడగలేదని, సాధారణ భక్తుడిలా ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళతానంటే డిక్లరేషన్ ఎందుకు అడుగుతున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి కూడా సీఎం గా వున్నప్పుడు, ఇతర సమయాల్లో పలుమార్లు స్వామివారిని దర్శించుకున్నారని ఏనాడూ డిక్లరేషన్ సమస్య రాలేదని చెప్పారు. సీయంలుగా వున్నప్పుడు జగన్, వైఎస్సార్ ఐదేళ్లపాటు స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారని రామకృష్ణ గుర్తుచేశారు.
■ దేశంలోనే సీనియర్ నేత చంద్రబాబు.. :
ప్రస్తుతం దేశంలోనే చంద్రబాబు నాయుడు సీనియర్ నేత. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే అవకాశం మళ్ళీ ఆయనకి దక్కిందని రామకృష్ణ చెప్పారు. ఎంతో కీలకమైన ఈ సమయంలో మతాల పేరుతో, కులాల పేరుతో బావోద్వేగాలని రెచ్చగొట్టే చర్యల్ని ఆయన నియంత్రించాలని కోరారు. మతం ఎజెండా తో జరిగే రాజకీయల్ని నిరోధించాలన్నారు. డేవాలయాల్ని కేంద్రం పరిధిలోకి తీసుకుంటామంటే తామేం చేయగలమని అన్నారు.