
Covid-19: కరోనా ఇంకా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. మొదటి, రెండో దశల్లో తిప్పలు పెట్టిన వైరస్ ఇప్పుడు దశలు మార్చుకుని డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్, ఏవై.12 అనే కొత్త రకంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏవై.12 తొలి కేసు ఉత్తరాఖండ్ లో ఆగస్టు 30న వెలుగు చూసింది. వారంలోపే దేశంలోని 15 స్టేట్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 178 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా గర్తించారు. ఈ నేపథ్యంలో దీని వ్యాప్తి కూడా అంతే వేగంగా విస్తరిస్తోందని తెలుస్తోంది. ఏపీలో 18, తెలంగాణలో 15 చొప్పున ఈ కేసులు నమోదయ్యాయి.
వివిధ స్టేట్లలో ఏవై.12 కేసులు వెలుగుచూడడంతో అన్ని ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది. సేకరించిన నమూనాలను ర్యాండమ్ పద్దతిలో పరీక్షించిన్పుడు ఏవై.12 కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపుతున్నారు. వీటిని పరీక్షించి ఉత్పరివర్తనాన్ని గుర్తిస్తున్నారు. డెల్టా ప్లస్ ఉత్పరివర్తనంతో వ్యాప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏవై.12 ఊపిరితిత్తుల కణాల్లో బంగా అతుక్కుపోతోందని మోనో క్లోనల్ యాంటీబాడీ స్పందన తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జన్యు క్రమ పరీక్షల్లో డెల్టా ప్లస్ కేసులు వెలుగులోకి రావడంతో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశీయంగా రాకపోకల్లో ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో వ్యాధి సంక్రమణ పెరుగుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ నిర్మూలనకు అందరు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఏవై.1, ఏవై.2, ఏవై.3 ఇప్పటికే వెలుగు చూడగా ప్రస్తుతం తాజాగా ఏవై.12 భయాందోళనలు సృష్టిస్తోంది. దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వేరియంట్ ఆప్ కన్నర్న్ గా ప్రకటించింది. ఈ వైరస్ అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. డెల్టా ఉత్పరివర్తనానికి సాంక్రమికత ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా సూచిస్తున్నారు. మనుషుల శరీరంలోని కణజాలానికి బలంగా అతుక్కునే లక్షణం దీనికి ఉంటుందని తెలిపారు. ఏవై.12 ఉపరకం తీవ్రత గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.