Chandrababu: వైసిపి( YSR Congress party ) హయాంలో చంద్రబాబు పై కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టయ్యారు. దాదాపు 52 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే అప్పట్లో అవి అక్రమ కేసులని టిడిపి ఆరోపించింది. కానీ అప్పటి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి చేశారని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ కేసులన్నీ తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ కేసుల ఎత్తివేతకు సిఐడి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన చట్టపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల న్యాయస్థానంలో ఓ పిటీషన్ రాగా.. సిఐడి తరఫున కేసుల ఎత్తివేతకు సంబంధించిన సన్నాహాలు స్పష్టంగా తెలిసాయి.
* చంద్రబాబు అరెస్ట్..
2023లో అమరావతిలో( Amravati capital ) అసైన్డ్ భూములతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కేటాయింపులో లబ్ధి పొందారని చంద్రబాబు పై కేసులు మోపారు. ఆర్థికలబ్ది పొందేందుకు వీలుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. అయితే రోడ్డు నిర్మాణమే జరగలేదు.. ఎలా అవినీతి జరుగుతుందని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రశ్నించినా.. అనేకరకాలుగా అభియోగాలు మోపుతూ కేసులు కొనసాగించింది అప్పటి ప్రభుత్వం. దాదాపు 52 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అసలు ఆధారాలు లేని కేసులో అన్ని రోజులు చంద్రబాబు జైల్లో ఉండిపోవడం పై న్యాయ నిపుణులు సైతం సందేహం వ్యక్తం చేశారు.
* కేసుల ఎత్తివేతకు సిఐడి సిద్ధం..
అయితే అప్పటి కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అప్పట్లో ఓ ఇద్దరు వ్యక్తులు ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడంలో అనేక రకాలుగా చంద్రబాబు లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదులు ఆధారంగా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు అరెస్టు సాగింది. ఇప్పుడు ఆ కేసులు పెట్టిన వారు విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఓ జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేసి ఇప్పుడు విత్ డ్రా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే దీనిపై ఏపీ సి ఐ డి రిప్లై ఇచ్చింది. అసలు కేసుతో సంబంధంలేని జర్నలిస్ట్ ఎలా పిటిషన్ పెడతారని ప్రశ్నించింది. ఫిర్యాదుదారులు కేసు విత్ డ్రా చేసేందుకు ముందుకు వచ్చారని కోర్టుకు చెప్పింది. తద్వారా చంద్రబాబుపై అప్పట్లో నమోదైన కేసులు క్లోజ్ చేయనున్నారు అన్నమాట.