Mudragada Padmanabham : ఒక స్థాయిలో ఉన్న నేతలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదు. అది హుందాతనం కూడా కాదు. అటువంటి కామెంట్స్ కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడకు అటువంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పటివరకు ముద్రగడ ఆజాతశత్రువుగా ఉండేవారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఆయన సన్నిహితులు ఉన్నారు. నేరుగా ముద్రగడ ఇంటికి వచ్చి భోజనం చేసిన నేతలు ఉన్నారు. అయితే అంతటి గుర్తింపు కలిగిన ముద్రగడ పవన్ విషయంలో మాత్రం తప్పటడుగులు వేశారు. పవన్ పిఠాపురంలో పోటీ చేసేసరికి ఆయనకు చిన్న మనిషిలా కనిపించారు. పిఠాపురంలో పవన్ గెలిచే ఛాన్స్ లేదని ముద్రగడ ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందుకే పవన్ విషయంలో వెనక్కి తీసుకోలేనంతగా వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. దానికి ఇప్పుడు బాధపడుతున్నారు.
గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయారు.ఈ ఎన్నికల్లో సైతం పవన్ ను ఓడిస్తామని వైసిపి ప్రతిజ్ఞ చేసింది. పవన్ పిఠాపురం ఎంచుకునేసరికి ముద్రగడను పార్టీలో చేర్చుకుంది. ముద్రగడకు వేరే బాధ్యతలు అప్పగించకుండా.. కేవలం పవన్ ను టార్గెట్ చేసుకునే పని అప్పగించినట్లు ఉంది. అందుకే వైసీపీలో చేరిన మరుక్షణం నుంచి ముద్రగడ పవన్ లక్ష్యంగా విమర్శలు చేశారు.పిఠాపురంలో పవన్ గెలిచే ఛాన్స్ లేదని.. ఒకవేళ గెలిచినా తాను పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు.పోలింగ్ ముగిసి.. పవన్ గెలుపు పై పక్కా ధీమాతో ఉన్న జనసైనికులు.. ముద్రగడను రకరకాలుగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసురుతున్నారు.
కౌంటింగ్ కు మరో రెండు వారాల వ్యవధి ఉంది. దాదాపు పిఠాపురంలో పవన్ గెలుస్తారని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. సగటు వైసీపీ అభిమాని సైతం టఫ్ ఫైట్ అంటున్నారే కానీ.. ఎక్కడ వైసీపీ గెలుస్తుందని మాత్రం చెప్పలేకపోతున్నారు. పోలింగ్ నాటికి పిఠాపురంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వార్ వన్ సైడే అన్నట్టు పరిస్థితి మారింది. అయితే ఇవేవీ గుర్తించని ముద్రగడ.. పవన్ పిఠాపురంలో గెలిచే ఛాన్స్ లేదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు. అందుకే పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. అయితే అనూహ్యంగా తన కుటుంబం నుంచి తనకు వ్యతిరేకత ప్రారంభమైంది. సొంత కుమార్తె పవన్ కు మద్దతు తెలిపారు. అప్పుడు కూడా వైసిపి పెద్దగా స్పందించలేదు. ముద్రగడకు అండగా నిలవలేదు. ఇప్పుడు జనసేన సోషల్ మీడియాలో అదే పనిగా ముద్రగడను టార్గెట్ చేసుకొని పోస్టులు పెడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేకుండా పోతోంది. దీంతో తన గౌరవానికి భంగం వాటిల్లడంతో ముద్రగడ లో ఒక రకమైన బాధ వ్యక్తం అవుతోంది. సన్నిహితులు వద్ద ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది.