Congress Vs BJP: ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే గట్టిగా అరవాల్సిన పనిలేదు. జస్ట్ విషయాన్ని అర్థం చేసుకునే విధంగా చెప్పగలిగితే చాలు.. ఇలా చెప్పాలంటే విషయ పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి. అలా కాకుండా విషయాన్నీ పక్కనపెట్టి.. పరిజ్ఞానాన్ని కూడా పక్కనపెట్టి గట్టిగా అరిస్తే ఉపయోగ ఉండదు. కేవలం అది వాగాడంబరం మాత్రమే అవుతుంది.
ఒకప్పుడు పాత్రికేయులు విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండేవారు.. వార్తలు చదువుతున్నప్పుడు మాత్రమే కాదు, వార్తలు రాస్తున్నప్పుడు కూడా విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేవారు. తద్వారా ప్రజలకు నిజాలు మాత్రమే తెలిసేవి. ఆ నిజాలలో కూడా గాడత ఉండటం వల్ల ప్రజలు వాటిని అత్యంత సులువుగా ఆకలింపు చేసుకునేవారు. కానీ రోజురోజుకు జర్నలిజం లో పరిస్థితులు మారిపోతున్నాయి.. విషయ పరిజ్ఞానం ఉన్న వారి కంటే.. వాగడంబరం ఉన్నవారు మాత్రమే ముందు వరుసలో ఉంటున్నారు. విషయాలను పక్కనపెట్టి వాగడంలో పోటీపడుతున్నారు.. తద్వారా జర్నలిజం కాస్త డబ్బా కొట్టే కార్యక్రమం మాదిరిగా మారిపోతోంది.
జర్నలిజం విస్తృతి పెరిగిపోయిన తర్వాత చానల్స్ లో డిబేట్లు నిర్వహించడం అధికమైంది. మొదట్లో డిబేట్లు అర్థవంతంగా సాగేవి. వీటిలో జరిగిన చర్చ ప్రజలకు వాస్తవాలను తెలిపేది. టీవీ చానల్స్ లో రాను రాను డిబేట్లు కుస్తీ పోటీల మాదిరిగా మారిపోతున్నాయి.. సరిగా కొన్ని సంవత్సరాల క్రితం ఓ టీవీ ఛానల్ లో చర్చ జరిగినప్పుడు ఓ పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడి మీద దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.. ఆ తర్వాత ఇలాంటి దాడులకు పాల్పడడం.. పరిపాటిగా మారిపోయింది.
ఇటీవల కాలంలో యూట్యూబ్ జర్నలిజం పెరిగిపోయిన నేపథ్యంలో నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. విషయపరిజ్ఞానాన్ని పక్కనపెట్టి కేవలం వాగడం వరకే పరిమితమవుతున్నారు. అంతటితో ఆగడం లేదు, దాడులకు పాల్పడుతున్నారు. చివరికి సహనాన్ని కోల్పోయి దూషణలకు కూడా దిగుతున్నారు. ఈ పరిణామాల వల్ల డిబేట్లు కాస్త కుస్తీ పోటీల మాదిరిగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని వియర్ షిప్ కోసం మేనేజ్మెంట్లు నిర్వహిస్తున్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆ మధ్య ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద గులాబీ పార్టీకి చెందిన నాయకుడు దాడి చేశారు. దీంతో మరుసటి రోజు ఆయన ఓ టీవీ లో నిర్వహించిన చర్చా వేదికలో హెల్మెట్ పెట్టుకుని కనిపించారు. దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.