IAS Haritha : ఎల్లో మీడియా చేయలేని పని.. ఆ టిడిపి నేత చేసి చూపించారు.. ఒక్క ట్విట్ తో ఐఏఎస్ ఊస్టింగ్!

ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం కోలుకుంటోంది. పాలన గాడిలో పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ టిడిపి నేతల సిఫారసులను పక్కనపెట్టి.. ఉన్నత స్థాయిలో చెప్పిన వారికే పోస్టింగులు దక్కుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Written By: Dharma, Updated On : August 15, 2024 1:00 pm

Commissioner Haritha

Follow us on

IAS Haritha : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అధికారులపై వేటు పడింది. గత ఐదేళ్లుగా వైసీపీ నేతలకు కొమ్ము కాసినట్లు చాలామంది అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో టిడిపి నేతల విషయంలో సైతం అడ్డగోలుగా వ్యవహరించిన వారు కూడా ఉన్నారు. సీఎంవో నుంచి జిల్లాల వరకు ప్రక్షాళన ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల ఫలితాల్లో కూటమి స్పష్టమైన విజయం సాధించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెలవులోకి వెళ్లిపోయారు. సీఎం ఓలో కీలక మార్పులు జరిగాయి. చాలామంది అధికారులను రిజర్వులో పెట్టారు.ఈ జాబితాలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఉన్నారు. అయితే ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇది సాధారణమే అయినా.. ఈసారి మాత్రం ప్రత్యేకం.ప్రభుత్వం,ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పనిచేయడం కామన్ అయినా.. గత ఐదేళ్లలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా చాలామంది అధికారులు వ్యవహరించారు.వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. వారిని మామూలుగా విడిచి పెట్టే ఛాన్స్ లేదని కూటమి ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. తాజాగా 11 మంది పోస్టింగ్ లేని ఐపీఎస్ అధికారులను హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకుండా డీజీపీ ఆఫీసుకు రోజు వచ్చి హాజరు వేయాలని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసిపి అస్మదీయ అధికారుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది.

* అనంతపురం జేసీగా నియామకం
అయితే సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా యువ మహిళ ఐఏఎస్ అధికారిణి హరితను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏమయిందో ఏమో కానీ నిన్న ఉన్నట్టుండి ప్రభుత్వం ఆమె పోస్టింగ్ను రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సి ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. అయితే దీని వెనుక ఒక కథ నడిచినట్లు తెలుస్తోంది.

* టిడిపి సీనియర్ నేత ట్విట్
నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబమంతా తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. అదే కుటుంబానికి చెందిన సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఇటీవల ఒక ట్వీట్ చేశారు. గతంలో నెల్లూరు కమిషనర్ గా పని చేసిన కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారిణి హరిత తాను చూసిన అత్యంత అవినీతిపరులైన ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా తిరుపతి కార్పొరేషన్ లో టి డి ఆర్ స్కామును రూపొందించింది కూడా హామేనని తేల్చి చెప్పారు. ఈ ట్విట్ ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది.

* అందరి నుంచి అదే ఫిర్యాదు
అయితే అధికారిణి హరిత వ్యవహార శైలి అలానే ఉండేది. పైగా వైసీపీ నేతలు చెప్పినట్లు విని అక్రమాలకు అండగా నిలిచారని తెలుస్తోంది. ప్రభుత్వం ఆరా తీయడంతో అంత స్పష్టమైంది. అందుకే ఆమెను పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటివరకు పని చేసిన ప్రాంతాల్లో టిడిపి నేతలు సైతం అవినీతిని స్పష్టం చేయడంతో ప్రభుత్వం పునరాలోచించింది. ఆమె నియామకాన్ని నిలిపివేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది అధికారులపై టిడిపి శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కానీ పై స్థాయిలో కొంతమంది వారికి అండగా నిలుస్తున్నడంతో లోకల్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ అస్మదీయులు కీలక పోస్టుల్లో నియమితులవుతున్నారని ఎల్లో మీడియా సైతం గగ్గోలు పెడుతోంది. కిందిస్థాయి నేతల అభిప్రాయాలు తీసుకోకుండా.. పై స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని..పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఇటీవల కథనాలు రావడం విశేషం. అయితే ఎల్లో మీడియా కంటే.. ఒక టీడీపీ నేత ట్విట్.. ఒక యువ ఐఏఎస్ మహిళా అధికారి నియామకం పై ప్రభావం చూపడం విశేషం.