NDA Aliance co-ordination Committee : ఏపీలో కూటమి పార్టీల మధ్య సమన్వయానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు పార్టీల మధ్య సుదీర్ఘకాలం సయోధ్య ఉండేలా వ్యూహరచన జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు ఛాన్స్ ఇవ్వకూడదని మూడు పార్టీలు స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చాయి. నిన్ననే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కీలక ప్రసంగం చేశారు. ఎటువంటి తప్పిదాలకు పాల్పడవద్దని పార్టీ ఎమ్మెల్యేలకు అధినేతలు సూచించారు. బిజెపి సైతం అలెర్ట్ గా ఉందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. మూడు పార్టీల సమన్వయానికి కీలక కమిటీ ఏర్పాటు చేయడానికి కూడా డిసైడ్ అయ్యారు. జగన్ జాతీయస్థాయిలో బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలను గుర్తించుకొని చంద్రబాబుతో పాటు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
* ఢిల్లీ వేదికగా జగన్ పోరాటం
అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన జగన్.. ఢిల్లీకి వేదిక మార్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్న జగన్.. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రేపు జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సమయంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు వారి అపాయింట్మెంట్ తీసుకునే పనిలో ఉన్నారు విజయ సాయి రెడ్డి. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురు అపాయింట్మెంట్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.
* చంద్రబాబు దిశ నిర్దేశం
మూడు పార్టీల మధ్య సమన్వయం లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే మూడు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇంకా ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నానని జగన్ భావిస్తున్నారని.. అందుకే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని పవన్ గుర్తు చేశారు. జగన్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వకుండా చూసేందుకు మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని పవన్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించారు. జనసేన తో పాటు బిజెపికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తానని కూడా స్పష్టం చేశారు. తద్వారా ఐక్యతగా ఉందామని సంకేతాలు పంపించారు. మరో 10 సంవత్సరాల పాటు మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు.
* పవన్ ముందే అలెర్ట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో పవన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. టిడిపి తో పాటు బిజెపి శ్రేణులకు సైతం గౌరవం ఇవ్వాల్సిందేనని జన సైనికులకు సూచించారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఈ పొత్తు కొనసాగాలని కూడా ఆకాంక్షించారు. లేనిపోని కామెంట్స్ వద్దని.. వివాదాలకు దూరంగా ఉండాలనిపవన్ సొంత పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను అలెర్ట్ చేశారు. చంద్రబాబు సైతం టిడిపి ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. బిజెపి హై కమాండ్ సైతం ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించింది. టిడిపి కూటమితో సమన్వయంతో ముందుకు సాగాలని కూడా ఆదేశించింది.
* కేంద్రానికి వార్నింగ్
కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని రాష్ట్రాలకు, రాజకీయ పక్షాలకు ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలు చంద్రబాబుతో పాటు పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో వైసిపి బిజెపికి సహకారం అందించింది. కానీ ఆ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను రాబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు అదే సాయాన్ని గుర్తు చేస్తూ బిజెపికి దగ్గర కావాలని వైసిపి చూస్తోంది. కానీ ఎటువంటి చాన్స్ ఇవ్వకూడదని చంద్రబాబుతో పాటు పవన్ కేంద్ర పెద్దలకు సూచించినట్లు సమాచారం. అయితే ఇంతలో ఏపీలో మూడు పార్టీల మధ్య సమన్వయం అనేది కీలకంగా భావిస్తున్నట్లు తెలిసింది. అందుకేఎవరి స్థాయిలో వారు.. ఈ విషయంలో పాటుపడుతున్నట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More