Rushikonda Palace : కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతోంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. అయితే అత్యంత వివాదాస్పదంగా మారిన విశాఖ రుషికొండ నిర్మాణాల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. మరోవైపు ఆ భవనాల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడుతోంది. రోజుకు లక్షల్లో ఖర్చు అవుతోంది. వందలాది మంది అక్కడ పని చేయాల్సి ఉంటుంది. విద్యుత్ చార్జీలు సైతం లక్షల్లో వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భవనాల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ప్రభుత్వం సతమతం అవుతోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఆ భవనాలను పరిశీలించారు. వాటిని ఎలా వాడుకోవాలో త్వరలో నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో నేడు శాసనసభలో రుషికొండ భవనాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
* వైసీపీ నిర్ణయం పై చర్చ జరగాలని
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైసీపీ సభ్యులు హాజరు కావడం లేదు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతోనే తాము హాజరు కావడం లేదని జగన్ చెబుతున్నారు. మరోవైపు శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో ఆ పార్టీ సభ్యులు హాజరవుతున్నారు. అయితే అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో రుషికొండ భవనాలపై అసెంబ్లీలో చర్చిస్తే జగన్ సర్కార్ వైఫల్యాలను బయట పెట్టవచ్చని కూటమి భావిస్తోంది. రుషి కొండను తొలచి ఈ నిర్మాణాలను ఎలా చేపట్టారు? ఎంత ఖర్చు పెట్టారు? అందులో విలాసవంతమైన సామాగ్రి, వాటిని భవిష్యత్తులో ఎలా వాడుకోవాలన్న దానిపై ఈరోజు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
* కీలక నిర్ణయం దిశగా
విశాఖ నగరంలో రుషికొండ పర్యాటక ప్రాంతం. సాగర నగరానికి తలమానికం. ఒక్కమాటలో చెప్పాలంటే ల్యాండ్ మార్క్. అటువంటి రుషికొండను పూర్తిగా గుండు కొట్టారు. వాటిపై భారీ భవంతులను నిర్మించారు. ఇందుకుగాను 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. అయితే ఆ నిర్మాణాలు ఎందుకు కట్టారు అన్నది మాత్రం బయటకు వెల్లడించలేదు. న్యాయస్థానాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ గెలిచి ఉంటే ఆ భవనాలను ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకునే వారన్న ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ నిర్మాణాలను ఎలా ఉపయోగించుకోవాలా తెలియక కూటమి ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ తరుణంలోనే అసెంబ్లీలో బలమైన చర్చను పెట్టి.. ఎలా వాడుకోవాలి అన్నదానిపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.