AP Minister RK Roja : మంత్రి రోజాకు పొమ్మనలేక పొగపెడుతున్నారా? నగిరిలో ప్రత్యర్థి వర్గానికి ప్రోత్సాహమందిస్తున్నారా? అధికార యంత్రంగాం సైతం సహాయ నిరాకరణ చేస్తోందా? సీనియర్ మంత్రి అండదండలతో వ్యతిరేక వర్గం బలపడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వ్యతిరేక వర్గానికి భారీగా ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం మైనింగ్ కాంట్రాక్ట్ ను అప్పగించింది. రోజా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా రాష్ట్రస్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగిరిలో రోజా పని అయిపోయిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీలో నోరున్న నేతల్లో రోజా ఒకరు. అందుకే హైకమాండ్ ప్రాధాన్యమిస్తూ వస్తోంది. 2014లో నగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన రోజా గెలుపొందారు. గాలి ముద్దుకృష్ణమనాయుడుపై స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.అయితే వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు దూకుడు పెంచుతూ వచ్చారు. అసెంబ్లీలో సస్పెన్షన్ కు కూడా గురయ్యారు.2019లో నగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. తొలి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించినా వర్కవుట్ కాలేదు. కానీ మలి విడతలో జగన్ చాన్సిచ్చారు. అయితే ఇక్కడ మంత్రిగా రోజా ఉన్నా వ్యతిరేక వర్గానిదే పైచేయిగా నిలుస్తోంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో కొంతమంది వ్యతిరేక వర్గంగా మారారు.
వ్యతిరేక వర్గానికి మునిసిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రోజా గెలుపునకు సహకరించారు. కానీ ఎన్నికల అనంతరం రోజా దూరం పెట్టారు. అప్పటి నుంచి నగిరి వైసీపీలో రెండు వర్గాలుగా మారాయి. రోజా, కేజే కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో నగిరి మండలం కీలపట్టులో కుమార్ కు 17 హెక్టార్లలో మైనింగ్ తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జగన్ దృష్టికి వెళ్లిన తరువాతే ఇటువంటి కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు జగన్ దృష్టిలో కుమార్ ఉండడంతో రోజా షాక్ కు గురయ్యారు.తాడేపల్లి వెళ్లి జగన్ కు ఫిర్యాదు చేయాలని డిసైడయ్యారు.
వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజాకు నగిరి టిక్కెట్ దక్కదన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. పలు సర్వేల్లో సైతం రోజా వెనుకబడినట్టు వార్తలు వచ్చాయి. రోజాను తప్పించి కొత్తవారికి టిక్కెట్ ఇస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు రోజా భావోద్వేగానికి గురయ్యారు. తనను సొంత పార్టీ నేతలే ఓడించేందుకు ప్రయత్నించారని.. కానీ ప్రజలు గెలిపించుకున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు హైకమాండే వ్యతిరేక వర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తుండడంపై లోలోన రగిలిపోతున్నారు. పార్టీ కోసం, అధినేత కోసం ప్రత్యర్థులపై అలుపెరగని పోరాటం చేస్తుంటే ఇదా ఫలితం అని నిట్టూరుస్తున్నారు.