Amaravathi : అమరావతికి అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ప్రజా తీర్పుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అమరావతి రాజధాని అని తేల్చేశాయి. మూడు రాజధానులు వద్దు అని ప్రజా తీర్పుతో స్పష్టమైంది. అందరికీ ముద్దు అమరావతి అని తేలిపోయింది. ఇక నిరభ్యంతరంగా అమరావతి రాజధాని నిర్మించుకోవచ్చు అని స్పష్టత వచ్చింది. దీంతో ఒక రకమైన సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. విదేశీ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు.. ఇలా ఒకటేమిటి.. అన్ని క్యూ కడుతున్నాయి. అమరావతిలో అడుగుపెడుతున్నాయి.రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమిలిచ్చేందుకు సర్కార్ ముందుకు వస్తున్న నేపథ్యంలో.. కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అందరి అభిప్రాయంతో అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో చాలా సంస్థలతో చంద్రబాబు సర్కార్ ఒప్పందం కూడా పూర్తి చేసుకుంది. కొన్ని సంస్థలు, కంపెనీలు తమ కార్యకలాపానులను, నిర్మాణ పనులను ప్రారంభించాయి. మరికొన్ని ఐకానిక్ నిర్మాణాలు సైతం ప్రారంభమయ్యాయి. కానీ ఇంతలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. జగన్ సర్కార్ ఒత్తిడి తట్టుకోలేక చాలా కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. సంస్థలు కార్యకలాపాలను నిలిపివేశాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో.. వెనక్కి వెళ్లిపోయిన కంపెనీలు, సంస్థలు మళ్లీ తిరిగి రావడం ప్రారంభించాయి.అశోక్ లేలాండ్ వంటి ప్రముఖ సంస్థలు తిరిగి వస్తున్న నేపథ్యంలో.. దాదాపు 45 కేంద్ర సంస్థలు కూడా రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో తమకు స్థలాలు కేటాయిస్తే తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు సిద్ధం అని సిఆర్డిఏకు పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సమాచారం ఇచ్చాయి. సిఆర్డిఏ కూడా వారితో సంప్రదింపులు జరుపుతోంది.ప్రధానంగా ఇండియన్ నేవీ,ఇండియన్ పోస్ట్, సిబిఐ, నాబార్డ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి,గెయిల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వంటి ప్రముఖ సంస్థలు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి.
ఇందులో చాలా కంపెనీలకు గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే భూములు కేటాయించారు. వాటి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి కూడా. కానీ ఇంతలో అధికార మార్పిడి జరిగింది. వైసిపి పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు గతంలో భూములు దక్కించుకున్న కంపెనీలు సిఆర్డిఏ తో సంప్రదించి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. భూములు కేటాయించని సంస్థలు సైతం సంసిద్ధంగా ఉన్నాయి. భూములు కేటాయిస్తే కంపెనీల కార్యకలాపాలు ప్రారంభిస్తామని ముందుకొస్తున్నాయి. మొత్తానికైతే అమరావతికి కొత్త పరిశ్రమలు, సంస్థలు క్యూ కడుతుండడం శుభపరిణామం. వాటికి వీలైనంత త్వరగా భూముల కేటాయింపు తో పాటు రాయితీల కల్పన, ప్రోత్సాహం అందిస్తే.. అమరావతి శరవేగంగా నవ నగరాలుగా రూపుదిద్దుకోవడం ఖాయం.
గతంలో మాదిరిగా భూ కేటాయింపులు అరకొరగా చేసి దులుపుకుంటే మాత్రం.. ఆ ప్రభావం పనులపై చూపడం ఖాయం. టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. 2014లో అధికారంలోకి వస్తే.. 2017 తర్వాత పనులు ఊపందుకున్నాయి. ఇబ్బందికరమే. ఇప్పటికే భూములు కేటాయించిన కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా.. కొత్త కంపెనీలకు భూ కేటాయింపులు చేసేలా.. పనులు వేగవంతమయ్యేలా చేస్తేనే అమరావతికి ఊపిరి వస్తుంది. ఆస్ఫూర్తితో నిర్మాణాలు సైతం ఊపందుకునే అవకాశం ఉంది. మరి చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.