CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) వాస్తవ పరిస్థితిని గుర్తించారు. దిద్దుబాటు చర్యలకు దిగారు. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేల వైఖరి పై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. వారి పనితీరు విషయంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇంకోవైపు కొందరు సీనియర్లు సైతం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా అసెంబ్లీలో, బయట మాట్లాడుతున్నారు. అటువంటి వారి విషయంలో చర్యలకు దిగకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే వారితో మాట్లాడే బాధ్యతలను ఇన్చార్జ్ మంత్రులకు అప్పగించారు. నిన్ననే మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు అతిగా వ్యవహరించారని.. స్వేచ్ఛకు మించి మాట్లాడారని ప్రస్తావించారు చంద్రబాబు. బయట కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రవర్తన బాగాలేదని.. అటువంటి వారికి ఒకసారి చెప్పి చూడాలని.. వినకుంటే తనకు చెప్పాలని చంద్రబాబు ఇన్చార్జ్ మంత్రులకు సూచించడం విశేషం.
* మంత్రులను నిలదీసినంత పని
ఇటీవల శాసనసభ సమావేశాలు( assembly sessions ) జరిగిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరు కావడంతో.. కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు విపక్షపాత్రను పోషించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే క్రమంలో మంత్రులను నిలదీసినంత పని చేశారు. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యేలు.. తమ అవకాశాలను అందిపుచ్చుకున్నారని కొంతమంది మంత్రులపై ఆగ్రహం పెంచుకున్నారు. అటువంటి వారంతా శాఖల పనితీరు, అభివృద్ధి, సమస్యలపై ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా మంత్రులను నిలదీసినంత పని చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, బొజ్జల సుధీర్ రెడ్డి, కూ న రవికుమార్ వంటి ఎమ్మెల్యేలు సభలో మాట్లాడిన తీరు మాత్రం కొంచెం అభ్యంతరకరంగా ఉంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ విషయంపై సీరియస్ అయ్యారు. మీరు చెప్పండి.. వినకుంటే తాను చూసుకుంటానని చెప్పుకొచ్చారు.
* ఉద్దేశపూర్వకంగానే..
చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు( senior MLAs ) ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు అన్నది ఒక అభిప్రాయం. తమకంటే జూనియర్లు మంత్రి అయ్యారు అన్న బాధ వారిలో కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాల్లో వివిధ సమీకరణలో భాగంగా చాలామంది మంత్రి పదవులు దక్కించుకున్నారు. వాటిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ ఎమ్మెల్యేలు వారిపై శాసనసభ తో పాటు జిల్లాల్లో జరిగే సమీక్షల్లో టార్గెట్ చేస్తున్నారు. మంత్రులు అన్న గౌరవం లేకుండా ప్రశ్నలతో పాటు నిలదీతలకు దిగుతున్నారు. మొన్న శాసనసభలో ఈ పరిణామాలన్నింటినీ గమనించారు సీఎం చంద్రబాబు. అందుకే ఇంచార్జ్ మంత్రులకు ఈ పని పురమాయించారు. ఎందుకంటే ఇంచార్జ్ మంత్రులకు జిల్లాల ఎమ్మెల్యేలతో సంబంధం ఉండదు కాబట్టి. వారు హెచ్చరించిన తర్వాత.. అప్పటికీ వినకుంటే చంద్రబాబు పిలిపించి మాట్లాడనున్నారు. అయితే ఎమ్మెల్యేలు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు, వారు జిల్లాలో నడుచుకుంటున్న వ్యవహారాలన్నీ చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన సీరియస్ యాక్షన్ లోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.