Kinjarapu Family: కింజరాపు కుటుంబానికి మరోసారి ప్రాధాన్యం ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇప్పటికీ ఆ కుటుంబంలో కేంద్రమంత్రి ఒకరు, రాష్ట్ర క్యాబినెట్లో మరొకరు ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొకరికి అవకాశం ఇచ్చారు. కింజరాపు సోదరుల్లో ఒకరైన ప్రభాకర్ నాయుడు ఇటీవల పోలీస్ శాఖలో పదవీ విరమణ చేశారు. అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. కొద్ది నెలల కిందటి పదవి విరమణ పొందిన ఆయన.. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డిగా నియమితులు కావడం విశేషం. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి, బిజీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్ నాయుడు సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో సేవలు అందించారు. ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. అయితే ఆయన సేవలు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఏడాది కాల పరిమితి తో కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ కీలక నియామకం చేపట్టింది.
* పోలీస్ శాఖలో విధులు
కింజరాపు ఎర్రం నాయుడు కు ముగ్గురు సోదరులు ఉన్నారు. అందులో మూడో సోదరుడు ప్రభాకర్ నాయుడు. చిన్న సోదరుడు అచ్చెనాయుడు రాజకీయాల్లో ఉన్నారు. మరో సోదరుడు హరిప్రసాద్ సైతం స్థానిక రాజకీయ వ్యవహారాలు చూస్తుంటారు. పోలీస్ శాఖలో వివిధ హోదాలో పని చేశారు ప్రభాకర్ నాయుడు. విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉండగా అడిషనల్ ఎస్పీగా ఇటీవల ప్రమోషన్ దక్కింది. అక్కడకు కొద్ది రోజులకే ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆయనను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డిగా నియమించింది.
* కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం
కూటమి ప్రభుత్వంలో కింజరాపు కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. ఎర్రం నాయుడు టిడిపిలో నెంబర్ 2 గా ఎదిగారు. ఆయన అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కుమారుడు రామ్మోహన్ నాయుడు. 2014 నుంచి వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారు రామ్మోహన్ నాయుడు. టిడిపి ఎన్డీఏలో చేరడంతో కీలకమైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు యువనేత రామ్మోహన్ నాయుడు. అదే సమయంలో ఆయన బాబాయ్ అచ్చెనాయుడు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు బాబు. కింజరాపు కుటుంబం పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఎర్రం నాయుడు మరో సోదరుడు ప్రభాకర్ నాయుడుకు కీలక విభాగంలో ఉన్నతాధికారిగా అవకాశం ఇచ్చారు.