https://oktelugu.com/

Tirumala Stampede : తిరుమలకు మంత్రుల క్యూ.. టీటీడీ కీలక అధికారి ఔట్.. భారీగా నష్టపరిహారం!

ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) తిరుమల చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్( Pawan Kalyan) తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా వెళ్తున్నారు. దాదాపు ఏపీ క్యాబినెట్ అంతా అక్కడే ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 9, 2025 / 03:21 PM IST

    Tirumala Stampede

    Follow us on

    Tirumala Stampede :  తిరుపతిలో( Tirupati) తొక్కిసలాటకు సంబంధించి కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ముగ్గురు మంత్రులను తిరుమలకు పంపించింది. హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హుటాహుటిన తిరుమల చేరుకున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు( Chandrababu) సైతం తిరుమల చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ సైతం తిరుపతికి వస్తున్నారు. బాధితులకు పరామర్శించునున్నారు. అయితే ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి సమీక్ష చేసిన సీఎం ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    * గేటు తీయడం వల్లే
    మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను అధికారులు సీఎం చంద్రబాబుకు( Chandrababu) నివేదించారు. బైరాగి పట్వడ వద్ద లోపల ఉన్న ఒక మహిళకు గాలి ఆడక స్పృహతప్పి పడిపోయారు. ఆమెను కాపాడేందుకు అక్కడ డి.ఎస్.పి గేట్ తీశారని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. టోకెన్ల కోసం గేట్ తీసారని భావించి ఒక్కసారిగా భక్తులు బయటకు వచ్చారని చెప్పారు. గేటు తీయడంతోనే తొక్కిసలాట ప్రారంభమైందని సీఎంకు వివరించారు టిటిడి అధికారులు. కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని ముందస్తుగా సమాచారం ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ఆరా తీశారు. భక్తుల ఏర్పాట్లపై ప్రణాళిక దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదికలో సైతం పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.

    * కొందరిపై వేటు
    మరోవైపు టీటీడీ( TTD ) అధికారుల్లో కొందరిపై వేటుపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాదు కేసులు కూడా నమోదు చేయాలని సీఎం హెచ్చరించారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా వస్తారని తెలిసి కూడా ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. మొత్తానికైతే ఈరోజు సాయంత్రానికి కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉంది. స్పష్టంగా తప్పు అని తెలిస్తే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం.

    * వరుసగా మంత్రులు
    ఇంకో వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సైతం తిరుమల చేరుకోనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ సైతం తిరుమల రానున్నారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. మొత్తం రాష్ట్ర క్యాబినెట్ అంతా తిరుమలలో కనిపిస్తోంది. ఇంకోవైపు ఈ ఘటన వెనుక విద్రోహ చర్య ఏమైనా ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకోవైపు తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున సాయం ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి పూర్తి వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చూస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.