CM Chandrababu: ఏపీ అభివృద్ధి పై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు( CM Chandrababu). గతంలో తెలంగాణ విషయంలో ఆలోచన చేశారు కానీ.. ఇప్పుడు దృష్టి అంతా ఏపీ పైనే. ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు చంద్రబాబు. దాదాపు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్ని సంవత్సరాలు కొనసాగిన ముఖ్యమంత్రి లేరు. అందుకే రాష్ట్ర విభజన జరిగినా తెలంగాణ పై మాత్రం మమకారం వదులుకోలేదు. కానీ ఇప్పుడు తెలంగాణను పూర్తిగా పక్కనపెట్టారు. కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం కావాలని ఆలోచన చేశారు. అందుకే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు ఏవి జరగడం లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పోటీ చేసే ఉద్దేశంతో లేదని తెలుస్తోంది.
* ఉమ్మడి రాష్ట్రంలో హవా..
ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధికారంలో ఉంది. ఆ పార్టీ 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించింది ఉమ్మడి రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ మాత్రం 1989, 2004, 2009లో గెలుపొందింది. చంద్రబాబు 9 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మరో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. రెండో ప్రయత్నంలో తెలుగుదేశం ఓటమి చవిచూసింది. మొన్నటి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది.
* తెలంగాణలోనూ పట్టు నిలుపుకోవాలని
ఏపీతోపాటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సజీవంగా నిలపాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. 2014లో ఏపీతోపాటు తెలంగాణలో బిజెపితో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రాగా.. తెలంగాణలో 15 సీట్లలో టిడిపి విజయం సాధించింది. కానీ అప్పుడే కెసిఆర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటే తనకు ఇబ్బంది అని భావించారు. ఈ క్రమంలోనే ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చి తెలంగాణ లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూశారు. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కానీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అటు తరువాత ప్రాభవం కోల్పోతూ వచ్చింది.
* రేవంత్ సీఎం కావడంతో..
అయితే 2018 ఎన్నికల్లో తెలంగాణలో దారుణంగా దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. అప్పటినుంచి టిడిపి తో కలిసేందుకు ఏ ఇతర పార్టీ కూడా అంగీకరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పూర్తిగా పోటీ చేయలేదు. తద్వారా తనను దెబ్బతీసిన గులాబీ పార్టీని దారుణంగా దెబ్బతీయ గలిగింది తెలుగుదేశం. తటస్థ వైఖరిని అవలంబించడం.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేయడం వంటివి జరగడంతో.. టిడిపి ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్ళింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. ఒక విధంగా చంద్రబాబు సన్నిహితుడుగానే రేవంత్ ను చూస్తున్నారు. మరోవైపు రేవంత్ అధికారం చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసే పని చేయడం లేదు. తద్వారా చంద్రబాబు దృష్టి కేవలం ఏపీ పైనే అని తేలిపోయింది.