CM Chandrababu
CM Chandrababu : ఏపీ( Andhra Pradesh) విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. 2014 తర్వాత మూడుసార్లు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అందులో రెండుసార్లు టిడిపి ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉండేది. అయితే ఈసారి మాత్రం ఏపీ విషయంలో మోది ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఏపీ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కీలక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణంలో కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీ అడిగిన నిధులను ఇచ్చేందుకు సమ్మతించారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ గా మారనుంది.
Also Read : ప్రజల చేతిలో ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం మరో గొప్ప ముందడుగు
* మూడోసారి.. ఎక్కువగా ప్రాధాన్యం
కేంద్రంలో ఎన్డీఏ( National democratic Alliance) మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందించింది. అందుకే ఏపీ విషయంలో ప్రత్యేక ఉదారతతో ఉంది కేంద్రం. అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు సాయంగా ప్రకటించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకొచ్చింది. ఏకంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జల శక్తి, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం కోసం కేంద్రం రూ. 5,512 కోట్ల రూపాయలు కేటాయించినట్లు అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలవరం కోసం ఒకే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇంత మొత్తంలో నిధులు విడుదల చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ నిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి.. అక్కడ నుంచి సింగిల్ నోడల్ అకౌంట్ కు చేరనున్నాయి.
* నాడు అంత సాయం లే
2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది. కేంద్రంలో టిడిపి భాగస్వామ్యం అయ్యింది. అయితే విభజన హామీల అమలు విషయంలో నాడు కేంద్రం పెద్దగా సహకరించలేదు. ఆ కారణంతోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేంద్రం నుంచి పెద్దగా నిధులు అందలేదు రాష్ట్రానికి. అయితే ఈసారి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కీలక భాగస్వామ్య పక్షంగా మారింది. పైగా పవన్ నేతృత్వంలోని జనసేన సైతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అందుకే రాష్ట్రం విషయంలో అనేక రకాల ప్రయోజనాలు పొందగలుగుతోంది ఏపీ.
* ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలు
ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుకు( polavaram project ) కేంద్రం 5వేల కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయం అందిస్తోంది. కేంద్ర మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12157 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అటు తరువాత 2807 కోట్లు ఇచ్చింది. ఇందులో పాత బిల్లుల రీయంబర్స్మెంట్ కొంత అయితే.. 2348 కోట్లు అడ్వాన్స్ నిధులే. అందులో 75 శాతం నిధులు ఖర్చు చేసి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే.? మరో విడత అడ్వాన్స్ నిధులు ఇస్తామని ప్రకటించింది. ఇక రెండో విడత 2705 కోట్ల అడ్వాన్స్ తో కేంద్ర జల శక్తి శాఖకు ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఆర్థిక శాఖ కొన్ని రకాల అభ్యంతరాలు తెలిపింది కానీ.. చివరకు ఆమోదించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఉదారంగా సాయం చేస్తుండడం విశేషం.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ ముగ్గురు.. చంద్రబాబు సంచలనం.. ఆ నిర్ణయాలు వెనుక కారణం అదే!