CII Summit: విశాఖలో పెట్టుబడుల సదస్సు తొలిరోజు విజయవంతం అయ్యింది. ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ నాలుగు పెట్టుబడుల సదస్సులు జరిగాయి. దావోస్ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సుకు ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఎన్నడూ లేన విధంగా తాజాగా జరుగుతున్న పెట్టుబడుల సదస్సు హైలెట్ గా నిలుస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఇదో అరుదైన అవకాశంగా భావిస్తోంది. అందుకే ఈ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాది కాలంగా సదస్సుకు అన్నివిధాలా సన్నాహాలు ప్రారంభించింది. ముందుగా సంబంధిత సంస్థలతో చర్చలు జరిపింది. ప్రభుత్వ పరంగా ఉన్న రాయితీలతో పాటు అన్నిరకాలుగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో సంబంధిత పరిశ్రమలు నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తొలిరోజు విశాఖ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు వేదికగా కీలక ఒప్పందాలు కూడా జరిగాయి.
సరికొత్త సంకేతాలు..
విశాఖ సదస్సుతో ప్రపంచంతో పాటు దేశం యావత్ విశాఖ వైపు చూస్తోంది. తొలిరోజు ట్రేడ్,టెక్నాలజీ, ఇన్నోవేషన్, సబ్స్టైనబిలిటీ, క్లైమేట్ యాక్షన్, జియో ఎకానమిక్ ఫ్రేమ్ వర్కు, ఇన్ క్లూజన్ వంటి అంశాలపై 48 సెషన్లు జరిగాయి. ముఖ్య అతిథిగా ఉప రాష్ట్ర పతి రాధాక్రిష్ణన్ హాజరుకావడం ద్వారా ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందింందని పూర్తిగా విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడం ద్వారా సరికొత్త సంకేతాలు ఇవ్వగలిగారు. ఈ సదస్సు టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ అనే నినాదంతో ముందుకు సాగుతోంది. అంటే ఇక్కడ జరుగుతున్న చర్చలు, ఒప్పందాలు నిజమేనని.. ఈ రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడులకు దోహదం చేస్తాయని చాటిచెబుతోంది. ఇప్పటివరకూ జరిగిన పెట్టుబడుల సదస్సు ఒక ఎత్తు.. ఇప్పుడు జరుగుతున్నవి మరో ఎత్తు అని చాటిచెబుతున్నాయి.
ముందుకొచ్చిన ప్రముఖ సంస్థలు..
సమ్మిట్ లో తొలిరోజు రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ రోజు మరో రూ.6 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరగనున్నాయి. ప్రముఖ ఫెర్టిలైజర్స్ సంస్థ కోరమండల్ రెండు వేల కోట్లకుపైగా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అదాని పోర్ట్స్, సెజ్ ఎండీ కిరణ్ అదానీ అయితే భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. బజాజ్ ఫైనాన్స్ సంస్థ తమ సేవలను ఏపీలో మరింతగా విస్తరించేందుకు నిర్ణయం తెలిపింది. ప్రధానంగా విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి శ్రీసిటీలో నైపుణ్య సంస్థలతో పాటు కార్యకలాపాలు పెంచేందుకు ముందుకొచ్చింది. లూలూ గ్రూప్ కంపెనీ ఏపీ వ్యాప్తంగా తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఆమోదం తెలిపింది.
అక్కడికక్కడే శ్రీకారం..
చంద్రబాబు ఇదే వేదికపై డ్రోన్ సిటీ ప్రకటనతో పాటు కంపెనీకి శంకుస్థాపన కూడా చేశారు.కర్నూలు జిల్లా వార్వకల్లులో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. మొత్తం 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో టెస్టింగ్ సర్టిఫికేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.ఇక్కడ 25 వేల మందికి శిక్షణ ఇచ్చేలా సౌకర్యం కల్పిస్తారు.మరోవైపు తిరుపతి, శ్రీ సత్య సాయి జిల్లాలో స్పేస్ సిటీ ఏర్పాటు కానుంది. పది సంవత్సరాల్లో 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. 35 వేల మందికి ఉపాధి కూడా లభించనుంది.రిలయన్స్ ఇండస్ట్రీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ కోర్టు ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇందులో ఏపీ ప్రభుత్వం ఇదివరకూ చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయడం విశేషం.