Chandrababu Naidu Arrested: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును ఎవరు తప్పు పట్టడం లేదు కానీ.. అరెస్టు చేసే తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. రాజకీయ పర్యటనలో ఉండే సమయంలో అరెస్టుకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది. అర్ధరాత్రి హడావిడి చేయడం అభ్యంతరకరంగా ఉంది. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉండగా, అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు వెళ్లడం తప్పుడు చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవినీతికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్టు చేయడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే అరెస్టు చేసిన తీరు బాగుండాలి.
ఇటీవల చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరు ఘటనలు ఎంతటి విధ్వంసానికి దారితీసాయో అందరికీ తెలిసిందే. చంద్రబాబును అరెస్టు చేయాలని అనుకుంటే, ఆయన జనం మధ్యలో ఉన్న సమయంలోనే చర్యలు చేపట్టాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చుట్టూ అంత మంది కార్యకర్తలు, నాయకులు ఉండగా అరెస్టు చేస్తే ఉద్రిక్తతకు దారితీయదా? కానీ కనీస స్పృహ లేకుండా ఏపీ సిఐడి అధికారులు వ్యవహరించారని విమర్శలు చుట్టుముడుతున్నాయి. సహజంగా పార్టీ అధినేతను అరెస్టు చేస్తారంటే పార్టీ శ్రేణులు సహించవు. నంద్యాలలో పార్టీ శ్రేణులు ఏమాత్రం ఆందోళనకు దిగినా.. అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చేది కాదన్న విషయం తెలుసుకోవాలి.
చంద్రబాబు రాజకీయ పర్యటనలో ఉండే సమయంలో అరెస్టు చేయాలన్న ఆలోచన తప్పు. ఇలా ప్లాన్ చేసింది ఎవరో కానీ.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఇప్పటికే అక్రమ అరెస్టులకు చిరునామా వైసీపీ సర్కార్ అని ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టు చేసిన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ చర్య చంద్రబాబును రాజకీయంగా మైలేజీ పెంచడానికి తప్ప.. అధికార పార్టీ సాధించేది ఏమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, ఆయన లాయర్లు, ఇతర నాయకులు నడివీధిలో నిలిచి అరెస్టు చేయడానికి వచ్చిన సిఐడి అధికారులను ప్రశ్నిస్తుండడాన్ని తెలుగు మీడియా మొత్తం కవర్ చేసింది. చంద్రబాబు అండ్ కో అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమ్ములుతుండడాన్ని ప్రజలంతా చూశారు.
వాస్తవానికి తనను అరెస్టు చేస్తారేమోనని మూడు రోజులు ముందుగానే చెప్పడం ద్వారా.. చంద్రబాబు ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. తన తప్పు లేకుండా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో అరెస్టు చేయాలనుకుంటే.. ఏపీ సిఐడి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజాక్షేత్రంలో ఉండగా చంద్రబాబును టచ్ చేసి ఏపీ సిఐడి.. వైసీపీ సర్కార్ మూల్యం చెల్లించుకునేలా వ్యవహరించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.