https://oktelugu.com/

Chiranjeevi : రామోజీరావు సంస్మరణ సభకు చిరంజీవి గైర్హాజరు.. కారణం అదే

Chiranjeevi : రామోజీ సంస్మరణ సభకు హాజరయ్యారు. కానీ నిర్మాత అల్లు అరవింద్ మాత్రం హాజరు కాలేదు. గత అనుభవాల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీ విషయంలో రామోజీ వ్యవహరించిన తీరుతోనే వారు దూరంగా ఉండిపోయారు అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : June 29, 2024 11:38 am
    Ramoji Rao

    Ramoji Rao

    Follow us on

    Chiranjeevi : ప్రస్తుతం సినీ పరిశ్రమకు మెగా కుటుంబం పెద్దదిక్కుగా ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా చిరంజీవి హాజరు ఇటీవల తప్పనిసరిగా మారింది. కానీ సినీ పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం కలిగిన రామోజీరావు సంస్మరణ సభకు మాత్రం చిరంజీవి హాజరు కాలేదు. కనీసం అల్లు అరవింద్ కూడా అటెండ్ అవ్వలేదు. టిడిపి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ మాత్రం హాజరయ్యారు. గత అనుభవాల దృష్ట్యా.. ఈనాడు సంస్థల నుంచి ఎదురైన ఇబ్బందుల వల్లే చిరంజీవి రామోజీ సంస్మరణ సభకు హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.

    ఇటీవల విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు మీడియా రంగం నుంచి సైతం ప్రతినిధులు హాజరయ్యారు. రామోజీరావు గొప్పతనాన్ని కొనియాడారు. సినీ పరిశ్రమ నుంచి రాజమౌళి,కీరవాణి, రాఘవేంద్రరావు, అశ్విని దత్, సురేష్ బాబు వంటి వారు హాజరయ్యారు. కానీ సినీ పరిశ్రమ పెద్ద హోదాలో చిరంజీవి మాత్రం కనిపించలేదు. అసలు ఆయనకు ఆహ్వానం అందిందా? లేదా? అనేది తెలియడం లేదు. ఇంతమందికి ఆహ్వానించి.. చిరంజీవికి ఆహ్వానించరా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కచ్చితంగా ఆయనకు ఆహ్వానం పంపించి ఉంటారని.. కానీ ఉద్దేశపూర్వకంగానే చిరంజీవి హాజరు కాలేదని ప్రచారం సాగుతోంది.

    అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఈనాడులో పతాక శీర్షిక కథనాలు వచ్చాయి. చిరంజీవి పార్టీ పెట్టిన నాటి నుంచే ఈనాడు విషం చిమ్ముతూ కథనాలు రాసింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. అయితే ప్రజారాజ్యం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందనే భావన ఆ పార్టీ నాయకులు కనిపించింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అక్కడికి కొద్ది కాలానికి ఈనాడు దినపత్రికలో ‘జెండా ఎత్తేద్దాం’ శీర్షికన ప్రజారాజ్యం దుకాణం బంద్ అంటూ పెద్ద   కథనం ప్రచురించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై చిరంజీవి కూడా రామోజీరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా చిరంజీవి ఈనాడు కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆ సమయంలో ఈనాడు పై చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారు. మా జెండాను పీకేయడానికి రామోజీరావు ఎవరని చిరంజీవి ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి రాకపోతే ఈనాడు సంస్థల అధినేత తట్టుకోలేరని.. ఎన్టీఆర్ ను కూడా టిడిపి నుంచి దూరం చేయడంలో రామోజీరావు ది ప్రముఖ పాత్ర అంటూ అప్పట్లో చిరంజీవి ఆరోపణలు చేశారు. అయితే ఈనాడులో కథనాలు వచ్చిన తరువాతనే ప్రజారాజ్యం పార్టీ నిర్వీర్యం అవుతూ వచ్చింది. ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసి వచ్చింది.

    అయితే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్ని దుష్ట శక్తులు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ నిర్వీర్యం కావడంలో రామోజీరావు పాత్ర కూడా ఉందనే ఆరోపణల నేపథ్యంలోనే.. చిరంజీవి ఆయన సంస్మరణ సభకు దూరంగా ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. వారంతా రామోజీ సంస్మరణ సభకు హాజరయ్యారు. కానీ నిర్మాత అల్లు అరవింద్ మాత్రం హాజరు కాలేదు. గత అనుభవాల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీ విషయంలో రామోజీ వ్యవహరించిన తీరుతోనే వారు దూరంగా ఉండిపోయారు అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.