Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం పెద్ద ఆఫర్ చేసిందా? పెద్ద బాధ్యత ఆయనపై మోపిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు విషయంలో చిరంజీవి గతం కంటే తన వైఖరిని మార్చుకున్నారు. ఎంతో గౌరవభావంతో చూస్తున్నారు. చంద్రబాబు సైతం చిరంజీవి విషయంలో సానుకూలంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు పవన్ కళ్యాణ్ తో చర్చించి.. చిరంజీవి విషయంలో చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని చిరంజీవికి చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కొంత సమయం కూడా కోరినట్లు సమాచారం.
* జనసేనతో పాటు కూటమికి మద్దతు..
మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. కూటమికి అనుకూలంగా క్యాంపెయిన్ కూడా చేశారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఒక్క అల్లు అర్జున్ మినహా.. మిగతా హీరోలంతా కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకార వేడుకలకు చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మెగా బ్రదర్స్ ఇద్దరికీ దగ్గరకు తీసుకుని ప్రజలకు అభివాదం చేశారు. అంతటి ప్రాధాన్యం చిరంజీవికి దక్కింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పట్ల చిరంజీవి సానుకూలంగానే ఉన్నారు. ఇటువంటి తరుణంలో చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* బ్రాండ్ అంబాసిడర్ గా..
మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్ల తో.. 70 లక్షల ఓట్లను సాధించింది ప్రజారాజ్యం పార్టీ. తరువాత అదే పార్టీ కాంగ్రెస్లో విలీనం అయింది. చిరంజీవి రాజ్యసభ సభ్యుడితో పాటు కేంద్ర మంత్రి అయ్యారు. క్రమేపి రాష్ట్ర విభజనతో ఆయన రాజకీయాలనుంచి దూరమయ్యారు. అయితే ఆయనను బిజెపిలోకి ఆహ్వానించి రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు పావులు కదిపారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి హయాంలో సైతం చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం నడిచింది. కానీ అప్పట్లో చిరంజీవి పెద్దగా సానుకూలత వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చిరంజీవి విషయంలో ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.. అదే విషయాన్ని చిరంజీవికి చంద్రబాబు వివరించినట్లు కూడా సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇప్పుడు అదే మాదిరిగా కూటమి సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే కొంత సమయాన్ని చిరంజీవి కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.



