Cheyutha Scheme: ఏపీ సీఎం జగన్ వరుసగా బటన్లు నొక్కుతున్నారు. ఎన్నికల ముంగిట వీలైనంతవరకు ఎక్కువ బటన్లు నొక్కి ఓట్లుగా మలుచుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇలా నొక్కుతున్న బటన్లు సరిగ్గా పనిచేస్తున్నాయో? లేదో? తెలియడం లేదు. అందుకే నెలల తరబడి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన గందరగోళం నెలకొంటుంది. అటు జగన్ నొక్కుతున్న బటన్లపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఎద్దేవా చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తును వైసీపీ వ్యతిరేకించింది. అయితే అదేదో బిజెపికి బలం ఉందన్న భావనతో అలా చేయలేదు. కేవలం కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక రుణ పరిమితులకు మినహాయింపుల విషయంలో ఇన్నాళ్లు దొరికిన సహకారం.. ఎన్నికల ముంగిట కొనసాగాలని వైసిపి భావించింది. ఇప్పటికే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా రుణపరిమితిని ఏపీ సర్కారు వాడుకుంది. ఇప్పుడు పథకాలకు డబ్బులు లేవు. బటన్ నొక్కిన తర్వాత అరకొరగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతూ వస్తోంది. అయితే అప్పుడెప్పుడో మూడు నెలల కిందట నొక్కిన బటన్ కు సైతం ఇంతవరకు నగదు జమ కాలేదన్న విమర్శలు ఉన్నాయి.
చేయూత పథకానికి సంబంధించి అనకాపల్లిలో బటన్ నొక్కి వారం రోజులు అవుతోంది. కానీ ఇంతవరకు ఒక్క లబ్ధిదారు ఖాతాల్లో కూడా డబ్బు జమ కాలేదు. కానీ ఊరూ వాడా చేయూత సమావేశాలు పెట్టి డబ్బులు వేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించి నగదు అందించేందుకు బటన్ నొక్కనున్నారు జగన్. పోనీ వీరి కైనా రోజుల వ్యవధిలో ఖాతాల్లో జమ అవుతాయా? అంటే అది కూడా డౌటే. చేయూత పథకానికి 5000 కోట్ల రూపాయల డబ్బులు కావాలి. మరోవైపు చూస్తే ఖజానాలో డబ్బులు ఖాళీ అయ్యాయి. చేసిన అప్పులు కూడా అస్మదీయులకు చెల్లింపులు జరిగిపోయాయి. ఆర్బిఐ కొత్త అప్పులు ఇవ్వడం లేదు. కనీసం ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వడం లేదు. ఈ పథకానికి సైతం ఇవ్వలేదు. ఇంతలో నోటిఫికేషన్ వస్తే అంతేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా చాలా పథకాలకు సంబంధించి చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల ముంగిట వీలైనన్ని ఎక్కువ బటన్లు నొక్కి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఇంతలో ఎన్నికల కోడ్ వస్తే ఎంచక్కా ఎగ్గొట్టాలని చూస్తున్నారు. ఇది ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.