TTD Board : తిరుమల( Tirumala) ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా ఉంది. తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు తో( CM Chandrababu) పాటు డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ గా ఉన్నారు. టీటీడీలో సమూల మార్పులు జరగాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈవో తో పాటు ఏఈఓ పై కూడా సీరియస్ అయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సమక్షంలోనే చైర్మన్ తో ఈవో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని కూడా సీఎం తీవ్రంగా పరిగణించారు. దీంతో టీటీడీలో మార్పులు ఖాయమని ప్రచారం నడుస్తోంది. ఈనెల 19 వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలు జరగనున్నాయి. అటు తరువాత ఈవో తో పాటు ఏఈఓ మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఈవో గా కీలక అధికారి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీటీడీలో చైర్మన్ తో పాటు ఈవో, ఏఈఓ పాత్ర కీలకం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఏఈఓ నియామకం చేశారు. తరువాత ఈవోను భర్తీ చేశారు. అటు తరువాత చైర్మన్ ను నామినేట్ చేశారు. అయితే ఆ ముగ్గురు మధ్య సమన్వయం లేదని తాజా ఘటనలతో తేలిపోయింది. అందుకే బదిలీ వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో పవన్ సైతం ఏవో తో పాటు ఏఈవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
* ఈవో, చైర్మన్ మధ్య విభేదాలు
వైకుంఠ ఏకాదశి( vaikunta Ekadashi) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు జరగడం ఆనవాయితీ. ఏటా మూడుసార్లు ఈ ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయి. ఆ పర్వదినాల్లో లక్షలాదిమంది భక్తులు హాజరవుతారు. స్వామి వారిని దర్శించుకుంటారు. ఈసారి కూడా ముందుగానే వైకుంఠ ద్వార దర్శనానికి సన్నాహాలు చేసింది టీటీడీ( Tirumala Tirupati Devasthanam). 15 సమావేశాలు నిర్వహించగా.. ఒక సమావేశంలో మాత్రమే చైర్మన్, ఈవో కలిసి పాల్గొన్నారు. దీంతో వీరిద్దరి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోంది. ఈవో శ్యామలరావు, చైర్మన్ బి ఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికీ వారుగా వ్యవహరించినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. కొద్ది రోజుల కిందట సీఎం చంద్రబాబును కలిసిన చైర్మన్ ఇదే విషయంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈవోని పిలిచి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు సైతం సూచించినట్లు సమాచారం. అయినా సరే సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.
* సమీక్షలో అసహనం
తాజాగా సీఎం చంద్రబాబు ( CM Chandrababu)ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. చైర్మన్ వర్సెస్ ఈవో అన్నంతగా పరిస్థితి మారింది. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఏక వచనంతో వాదనకు దిగారు. అందుకే టీటీడీ విషయంలో దిద్దుబాటు చర్యలకు దిగాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు ఏఈఓ వెంకయ్య చౌదరి పై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ముగ్గురు తీరుపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిఆర్ నాయుడుది నామినేటెడ్ పోస్ట్ కావడం.. ఆయన ఇటీవలే నియమితులు కావడంతో ఆయన మార్పు ఉండకపోవచ్చు.
* ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి
టీటీడీ ఈవో గా( TTD EO ) ఒక సమర్థవంతమైన అధికారిని నియమించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావు స్థానంలో రానున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. అయితే శ్యామలరావు పనితీరు విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. సమర్థవంతమైన అధికారి కావడం వల్లే చంద్రబాబు ఆయనను పిలిచి మరి బాధ్యతలు అప్పగించారు. కానీ చైర్మన్ తో పాటు ఏఈఓ ను సమన్వయం చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. పెద్ద ఘటన జరిగిన తర్వాత చర్యలకు దిగకపోతే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే చంద్రబాబు టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈనెల 19 తర్వాత భారీ మార్పులు జరగనున్నట్లు ప్రచారం నడుస్తోంది.