Chandrababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి వైసిపి దూకుడు మీద ఉంది. అటు తెలుగుదేశం జనసేనతో పెట్టుకుంది. బిజెపితో సైతం పొత్తుకు సానుకూలంగా పావులు కదుపుతోంది. టిడిపి, జనసేన, బిజెపిల మధ్య పొత్తు కుదిరితే.. తెలుగుదేశం పార్టీ చాలావరకు స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో ఆశావహులు రెబెల్స్ గా మారే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు టికెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటు విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో కొత్త ఫార్ములా తో రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికి వరకు ఉన్న సమాచారం మేరకు 40 అసెంబ్లీ స్థానాలు, 10 వరకు పార్లమెంట్ స్థానాలను టిడిపి పొత్తులో భాగంగా వదులుకోవాల్సి ఉంటుంది. జనసేనకు అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఇచ్చి.. బిజెపికి పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కొందరు టిడిపి నేతలకు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా సీనియర్ నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ అయితే త్యాగాలు చేయాల్సి ఉంటుందో.. ఆ స్థానాల్లో టిడిపి నేతలను పిలిపించి మాట్లాడిస్తున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నామినేటెడ్ పదవులను ఆఫర్ చేస్తున్నారు.దీంతో చాలామంది నేతలు మెత్తబడుతున్నట్లు సమాచారం.
పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో… ఒక కుటుంబంలో ఒకటే టికెట్ అని తేల్చి చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం విషయంలో మినహాయింపు ఇస్తున్నారు. మిగతా జిల్లాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటే టికెట్ తీసుకోవాలని.
.. ఎంపీ కావాలంటే పార్లమెంట్ స్థానం.. ఎమ్మెల్యే కావాలంటే అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తానని సమాచారం పంపిస్తున్నారు. అవసరమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా కొన్ని సీనియర్ కుటుంబాలకు చంద్రబాబు ఆఫర్ ఇస్తున్నారు. టిడిపిలో చాలామంది నమ్మకమైన సీనియర్లు ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. మైలవరం విషయంలో దేవినేని ఉమాను పక్కకు తప్పించనున్నారు. అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ను ఖరారు చేయనున్నారు.
ఇప్పటికే జనసేనకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలో ఒక స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు ఖరారు అయితే.. మూడు పార్టీల అభ్యర్థులు ఎక్కడెక్కడ బరిలో దిగుతారని ఒక జాబితాను రూపొందించి ఏకకాలంలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సోమవారం చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచే పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ అసమ్మతికి తావు లేకుండా.. త్యాగాలు చేయాల్సిన చోట నేతలను ముందుగానే పిలిపించి మాట్లాడాలని భావిస్తున్నారు. రేపు ఆ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగనుంది. ఎల్లుండి పవన్, చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత పొత్తులపై ఫుల్ క్లారిటీ రానుంది.