Chandrababu Warns MLA MS Raju: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) తెలుగుదేశం పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గత అనుభవాల దృష్ట్యా ముందుగానే మేల్కొన్నారు. కొందరి వైఖరిపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 135 మంది ఎమ్మెల్యేలు పార్టీ గుర్తుపైనే గెలిచారన్న విషయాన్ని గుర్తు చేశారు. సొంత ఇమేజ్ తో గెలిచారు అన్నది అబద్ధమని.. అలా అనుకుంటే బయటకు వెళ్లి పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారంలో చంద్రబాబు గట్టిగానే హెచ్చరికలు పంపారు. పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందో తిరువూరు లో పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ విషయంపై చంద్రబాబు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం అవుతుంది.
Also Read: పవన్ స్టైల్ మారింది.. ఏంటీ కొత్త సంకేతం?
* సంచలన ఆరోపణలు..
కొద్ది రోజుల కిందట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ టికెట్ కోసం విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తన వద్ద ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పెను వివాదానికి దారితీసింది. అయితే రోజురోజుకు తిరువూరు ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారడంతో అధినేత చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై తిరువూరు ఎమ్మెల్యే తో పాటు ఎంపీ కేసినేని చిన్ని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఆ నివేదికను తనకు అందించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు అధినేత. వారిచ్చే సంతృప్తికరమైన సమాధానం బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే తిరువూరు ఎమ్మెల్యే కు మాత్రం ఇదే చివరి అవకాశంగా తెలుస్తోంది.
* కేంద్ర కార్యాలయానికి అధినేత..
నిన్ననే పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు చంద్రబాబు. ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు వద్ద ఒక నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భగవద్గీత పై ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థాయి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అని.. అది చివరకు పార్టీకి చేటు తెస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించినట్లు సమాచారం. లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కమిటీలను ఏర్పాటు చేసుకుంటామని.. వివాదాస్పద నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెడతానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇకనుంచి విధిగా పార్టీ కార్యాలయానికి వస్తానని.. క్రమశిక్షణ కట్టు దాటితే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తిరువూరు ఎమ్మెల్యేకు ఇదే లాస్ట్ చాన్స్ అని సమాచారం. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ ఎదుట ధిక్కారస్వరం వినిపిస్తే.. సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.