TDP Re Entry in Telangana: ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చింది. ఎన్నో సంక్షోభాలను దాటుకొని ప్రధాన పార్టీగా నాలుగు దశాబ్దాల పాటు తన ఉనికి చాటుకుంటూ వస్తోంది. కానీ తెలంగాణలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కనీసం ఆ పార్టీ విభాగానికి తెలంగాణ నుంచి అధ్యక్షుడు లేకపోవడం గమనార్హం. చివరిగా కాసాని జ్ఞానేశ్వర్ 2023 ఎన్నికల వరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఉండేవారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడానికి నిరాకరించడంతో ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అది మొదలు ఎంతవరకు అధ్యక్ష పదవి భర్తీ చేయలేదు. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద లోటు తెలంగాణలో.. తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా పోటీ చేయాలని తెలంగాణ నేతలు కోరారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు నో చెప్పారు.
ఘనమైన చరిత్ర..
తెలంగాణలో( Telangana) తెలుగుదేశం పార్టీకి చాలా చరిత్ర ఉంది. బలమైన ఓటు బ్యాంకు దాని సొంతం. కానీ కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దెబ్బ తగులుతూ వస్తోంది. 2014 వరకు గణనీయమైన పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ ఊపిరిని తీయడం ప్రారంభించారు కెసిఆర్. తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టి.. తన టిఆర్ఎస్ను బలోపేతం చేసి.. రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు కెసిఆర్ ఓడిపోయారు. అయినా సరే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు టిడిపి నాయకత్వం ఇష్టపడడం లేదు. దానికి కారణాలు కూడా తెలియడం లేదు.
అధినేతను కలిసిన టిటిడిపి నేతలు..
తాజాగా జూబ్లీహిల్స్ ( Jubilee Hills)ఉప ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబును కలిశారు. పోటీ చేద్దామన్న ప్రతిపాదన పెట్టారు. అయితే బిజెపితో పొత్తు ఉన్న నేపథ్యంలో.. ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న తరుణంలో.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ వద్దని చంద్రబాబు వారిని వారించారు. అయితే ఈ విషయంలో తెలంగాణ టిడిపి నేతలు సైలెంట్ అయ్యారు. అలా అయితే తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని వారు అధినేతను కోరారు. కానీ చంద్రబాబు మాత్రం ముందుగా పార్టీ బలోపేతం చేయండి.. తరువాత చూద్దాం.. బలమైన నేతను అధ్యక్షుడిగా నియమిద్దాం అంటూ వారిని సముదాయించారు. అసలు చంద్రబాబు మధ్యలో ఏముందో తెలియక తెలంగాణ టిడిపి నేతలు అయోమయానికి గురయ్యారు. ఏం చేయాలో తెలియక సమావేశం నుంచి నిష్క్రమించారు.
వైసిపి మాదిరిగా కాకుండా..
1983 నుంచి 2014 వరకు తెలంగాణలో ప్రధాన పార్టీగా తెలుగుదేశం ఉండేది. అయితే రాష్ట్ర విభజన తో ఏపీకి మాత్రమే పరిమితం అయింది. అయితే 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం నామమాత్రంగానే తెలంగాణలో పోటీ చేసింది. కెసిఆర్ తో ఉన్న అవగాహనతో అటు తరువాత పూర్తిగా వైసిపి తన రాజకీయ కార్యకలాపాలను ముగించింది. పోనీ వైసీపీ మాదిరిగా తెలంగాణ రాజకీయాలకు టిడిపి దూరంగా జరగలేదు. అలాగని క్రియాశీలకం కావడం లేదు. ఈ పరిస్థితిని చూసి తెలంగాణ టిడిపి నేతలు ఆందోళనకు గురవుతున్నారు. లక్ష 70 వేలకు పైగా సభ్యత్వాలు చేశారు. అయినా సరే నాయకత్వం నుంచి సరైన దిశా నిర్దేశం రాకపోవడంతో ఆందోళనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అయితే చంద్రబాబు మదిలో ఏముందో తెలియక వారు సతమతమవుతున్నారు.