AP 2024 Elections : ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తోంది. పొత్తులుంటాయని జనసేనాని పవన్ స్పష్టం చేయడంతో పొరలు విప్పుకుంటున్నాయి. టీడీపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని తెలుస్తోంది. అయితే బీజేపీ ఎటువైపు అన్నట్టు తేలాల్సి ఉంది. బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ, జనసేనలు కోరుకుంటున్నాయి. అయితే బీజేపీ మాత్రం జనసేనతో కలిసి నడుస్తానని చెప్పుకొస్తోంది. టీడీపీని వద్దంటుంది. టీడీపీ లేకుండా బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టడం అసాధ్యమని జనసేనాని భావిస్తోంది. అది వైసీపీకి లాభం చేకూర్చడమేనని పవన్ భావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు ఆ విషయాన్నే చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ ఏకంగా మీడియా ముందుకొచ్చి పొత్తులు ఉంటాయని చెప్పడంతో బీజేపీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు టాక్ ప్రారంభమైంది.
బలమైన ప్రత్యర్థి..
ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ బలంగా ఉంది. మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలతో గట్టెక్కుతామని భావిస్తోంది. ఈ క్రమంలో విపక్షాలన్నీ ఒకతాటిపైకి రావాలని పవన్ అభిప్రాయపడుతున్నారు. అందర్నీ ఏకతాటిపైకి తెస్తానని కూడా ప్రకటించారు. అన్నింటికీ మించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వస్తేనే ప్రత్యర్థిని ఢీకొట్టడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ రాకుంటే వామపక్షాలు,కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయ పార్టీలు ఉన్నాయి. అయితే ఇదే విషయాన్ని నిన్న పవన్ ప్రస్తావించారు. వామపక్షాలను కలుపుకెళ్లేందుకు చూస్తున్నా.. అవి రావడం లేదని.. బీజేపీతో ఉన్న సైద్ధాంతిక విభేదమే అందుకు కారణమని ఉదహరించారు.
మారిన ఆలోచన..
ఏపీ విషయంలో బీజేపీ ఆలోచన సరళి మారినట్టు తెలుస్తోంది. 2024లో కేంద్రంలో మళ్లీ బీజేపీ రావడం ఖాయమంటున్నారు. ఆ విషయంలో చాలా మందికి ఎలాంటి డౌట్సూ లేవు. ఏపీలో మాత్రం ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారన్నది ఇంకా తేలలేదు. ఒక అంచనా మాత్రం ఉంది. వైసీపీ పథకాలను ఆశించి మాత్రమే ఓటు వేస్తే.. మళ్లీ వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందనీ.. ఐతే.. 2019లో వచ్చినన్ని సీట్లు రాకపోవచ్చనే అంచనా ఉంది. అలాకాకుండా.. ప్రజలు పథకాలను ఆశించకుండా ఓటు వేస్తే మాత్రం టీడీపీ+జనసేన అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణ ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ హైకమాండ్ కూడా పొత్తుతోనే ముందుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
పదవి వరిస్తే..
అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే సీఎం పదవి అనేది వరించేలా తప్ప..మనం వెతుక్కుంటూ వెళ్లకూడదని పవన్ తేల్చిచెప్పడంతో ఆయన రేసు నుంచి తప్పుకున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకే ఆయన పల్లకి మోస్తున్నారంటూ పవన్ పై విపక్షాలపై దాడులు ప్రారంభించాయి. అయితే పవన్ వ్యూహాత్మకంగానే ఆ మాటలు అన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ పొత్తుతో ముందుకెళ్లినా.. టీడీపీ మ్యాజిక్ ఫిగర్ కి కూత వేటు దూరంలో నిలిచిపోతే.. అదే సమయంలో జనసేన ఆ గ్యాప్ ను పూడ్చేటంత సీట్లు తెచ్చుకుంటే సీఎం పదవి దానంతట అదే వరిస్తుందని జన సైనికులు విశ్లేషిస్తున్నారు. అదీ కాకుంటే సీఎంగా చంద్రబాబు ఉండి.. డిప్యూటీ సీఎం పోస్టులో పవన్ ఉంటారని మరోరకంగా విశ్లేషిస్తున్నారు. బీజేపీకి కనీస ప్రాతినిధ్యం దక్కే అవకాశం పొత్తుల ద్వారానే సాధ్యమవుతుందని విశ్లేషణలు ఉన్నాయి.