Chandrababu: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ నెలాఖరుకు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఒకవైపు సిద్ధం పేరిట ప్రచార సభలు నిర్వహిస్తూనే.. జగన్ అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తున్నారు. అటు టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఆ రెండు పార్టీలు బిజెపి కోసం ఎదురుచూస్తున్నాయి. బిజెపి అడుగులతోనే వాటి మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే రెండో వారం నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఆ రెండు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ ఆకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అటు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కోరారని.. ఖరారయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ పొత్తులు కార్యరూపం దాల్చడం లేదు. పొత్తులపై రాష్ట్ర శాఖ ఒకలా.. జాతీయ నాయకులు మరోలా వ్యవహరించడమే ఇందుకు కారణం.
అయితే రాష్ట్ర బిజెపిలో మెజారిటీ నాయకులు పొత్తుకు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జాతీయ నాయకుడు ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర బిజెపి నాయకుల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించారు. కానీ పొత్తుపై ఎటువంటి సానుకూలతలు ఢిల్లీ నుంచి రావడం లేదు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఒక నిర్ణయం వస్తుందని అంతా ఆశించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రకటన వెలువడుతుందని చెప్పుకొచ్చారు. కానీ బిజెపి హై కమాండ్ నుంచి అటువంటి సంకేతాలు ఏవి రావడం లేదు. దీంతో బిజెపి ఒంటరి పోరుకు సిద్ధమైందని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్డీఏ లో పాత భాగస్వామ్య పక్షాలకు బిజెపి నాయకత్వం నుంచి పిలుపు వస్తోంది. ఇప్పటికే కర్ణాటక కు చెందిన జెడిఎస్ ను ఎన్డీఏ లోకి రప్పించారు. అటు నితీష్ నేతృత్వంలోనే జేడీయు సైతం ఎన్డీఏతో జత కట్టింది. ఇప్పుడు చంద్రబాబుకు సైతం పిలుపు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. తద్వారా మరో 10 సంవత్సరాలు సుస్థిర పాలన అందించాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా స్నేహితులను సైతం చేరదీయాలని భావించింది. అందులో భాగంగానే చంద్రబాబుకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.