Chandrababu: ఎన్టీఆర్ ప్రచార రథం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందింది వారాహి. గత ఏడాది జూన్ లో రోడ్డుపైకి వచ్చిన ఈ వాహనం సంచలనం సృష్టించింది. దీనిని వైసీపీ నేతలు అడ్డుకోవాలని చేసిన ప్రయత్నంలో వారాహి వాహనం సామాన్య జనాల్లో సైతం చర్చకు కారణమైంది. తెలంగాణలో తయారుచేసిన ఈ వాహనం.. ఏపీలో ఎంటర్ అయ్యే సమయంలో వైసీపీ నేతల నుంచి రకరకాల అభ్యంతరాలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ అధిగమించుతూ వారాహి వాహనం ఏపీలో అడుగు పెట్టింది. ఎన్నో సంచలనాలకు వేదికగా మారింది. ఈ వాహనం శత్రుదుర్భేద్యం.పైగా విశాలంగా ఉంటుంది.నాయకుల ప్రసంగానికి తగ్గట్టుగా దీనిని రూపొందించారు. అయితే ఇప్పటివరకు పవన్ మాత్రమే ఈ వాహనాన్ని వినియోగిస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా టిడిపి అధినేత చంద్రబాబు వారాహి వాహనాన్ని వినియోగించారు.
కూటమి పార్టీల ఉమ్మడి సభ పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. అంతకుముందు తణుకులో కూడా సభను నిర్వహించారు. కానీ అక్కడకు వారాహి వాహనం రాలేదు. నిడదవోలు సభ వారాహి వాహనం పైనుంచి జరిగింది. తొలిసారిగా ఈ వాహనాన్ని తిలకించిన చంద్రబాబు బాగుందని కితాబిచ్చారు. ఇదే వాహనంపై నుంచి చంద్రబాబుతో పాటు పురందేశ్వరి సైతం ప్రసంగించారు. వైసిపి ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఏడాది జూన్ లో ఇదే వారాహి వాహనంపై రకరకాల చర్చ నడవగా.. ఇప్పుడదే వాహనం మూడు పార్టీల ఉమ్మడి వేదికగా నిలవడం విశేషం.
అయితే వారాహి వాహనం గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.’వారాహి వాహనం పేరు వినడం.. వీడియోలు,ఫోటోల్లోచూడడమే తప్ప.. ప్రత్యక్షంగా ఈ వాహనాన్ని చూసింది లేదు. పవన్ కళ్యాణ్ నాకు అనేకమార్లు ఈ వాహనం గురించి వివరించారు. ప్రత్యేకతలు చాలానే ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడే ప్రత్యక్షంగా చూస్తున్నా. వాహనం చాలా బాగుంది’ అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికైతే వారాహి వాహనం ఇతర పార్టీల నేతలకు సైతం ఆకర్షించడం విశేషం. ఎన్టీఆర్ ప్రచార రథం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందడాన్ని జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.