ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఏపీ సీఎం జగన్ ఏపీ ప్రగతి గురించి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ లో ఆయన ఏపీ ప్రగతి బ్రహ్మాండం అని చెప్పుకున్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సు ద్వారా ఏకంగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని జగన్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ముందు చెప్పుకొచ్చారు. ఏపీలో నాలుగు కొత్త పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా ఏపీనే అగ్రస్థానంలో ఉందని జగన్ తెలిపారు. విద్యా వైద్య రంగాల్లో కీలకమైన సంస్కరణలు తెచ్చామని అన్నారు. జగన్ స్పీచ్ ని మోడీ, అమిత్ షా వినడమే కాకుండా కీలకమైన పాయింట్స్ ని నోట్ చేసుకున్నారు.
అదే సమయంలో చంద్రబాబు సైతం మహానాడు కీలక ప్రసంగం చేశారు. వైసీపీ సర్కారు తీరు, జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ పూర్తిగా విధ్వంసానికి గురైందన్నారు. తాను ఉన్న ఏపీ ఆదాయం తెలంగాణాతో పోటీ పడితే ….ఇపుడు తెలంగాణ పది రెట్లు ముందుకు సాగిందని… దానికి జగన్ అసమర్థ పాలనే కారణమని ఆరోపించారు. ఏపీలో ప్రగతి శూన్యం అని… జగన్ దిగిపోతేనే తప్ప ఏపీకి ఉనికి, ఊపిరి ఉండవన్నారు. తాను ఎంతో కష్టపడి ఏపీ అభివృద్ధి కోసం తాపత్రయపడితే జగన్ వచ్చి మొత్తం నాశనం చేశారని బాబు విమర్శించారు. పోలవరం అమరావతి ఈ రెండూ ఈ రోజు ఇలా ఉండడానికి కారణం జగన్ అని చంద్రబాబు విమర్శించారు.
అయితే ఒకేసారి సీఎం, విపక్ష నేతల ప్రసంగాలు చూస్తున్న ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇరు పార్టీల నాయకులు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. జగన్ సొంత ప్రభుత్వం మీద డప్పు వాయించుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తే… చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఉపన్యాసాలతో సుత్తి కొడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మీడియాలో చూసి వాస్తవ నిర్ణయానికి వద్దామన్న ప్రజలకు.. వర్గాలుగా విడిపోయిన సదరు మీడియా సంస్థలు మరింత అయోమయంలో పెట్టేస్తున్నాయి.