CM Chanrdababu : బాలకృష్ణకు సారీ చెప్పిన చంద్రబాబు.. సడన్ గా తెలంగాణ పర్యటన రద్దు

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం సీఎంగా చంద్రబాబు సేవలందించారు. ఈ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయి 30 సంవత్సరాలు అవుతోంది. నందమూరి బాలకృష్ణ సినీ రంగానికి పరిచయమై 50 ఏళ్లు అవుతోంది. అయితే ఈ ఇద్దరు విషయంలో వేడుకలు జరుపుకోవాలని అభిమానులు ఆశించారు.

Written By: Dharma, Updated On : September 2, 2024 12:18 pm

CM Chanrdababu

Follow us on

CM Chanrdababu : ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద ముంపులోనే చిక్కుకున్నాయి. ప్రభుత్వ సహాయ చర్యలు మొదలయ్యాయి. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు.విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉంటూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.నిన్న సాయంత్రం వరకు సహాయ చర్యలను పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు.. అర్ధరాత్రి బోటులో బయలుదేరారు. భద్రతా సిబ్బంది వద్దని వారిస్తున్నా.. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. ఆహారం, ఇతర కిట్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సోమవారం నాటికి సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు. బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు తాను విజయవాడ కలెక్టరేట్లో ఉంటానని చెప్పుకొచ్చారు. అవసరం అయితే బస్సులోనే గడుపుతానని తేల్చి చెప్పారు.

* ఆ రెండు వేడుకలకు
ప్రజలు బాధల్లో ఉండగా రెండు వేడుకలకు దూరమయ్యారు చంద్రబాబు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొలిసారిగా 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు సీఎం గా పని చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా 2014లో ఎన్నికయ్యారు. 2024 లో ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తొలిసారి ముఖ్యమంత్రి అయి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకోవాలని భావించాయి. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే వేడుకలు జరుపుకోవడం తప్పు అని వారించిన చంద్రబాబు.. నిన్న ఆ వేడుకలకు దూరమయ్యారు.

* బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు
వాస్తవానికి చంద్రబాబు తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. బావమరిది, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నట జీవితం 50 సంవత్సరాలు పూర్తయింది. దీంతో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ వేడుకలు నిన్ననే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. కానీ ప్రజలు బాధల్లో ఉంటే తాను.. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు వెళ్లడం సమంజసం కాదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు.

* ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు
నందమూరి బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున.. హైదరాబాదులో జరుగుతున్న వేడుకలకు హాజరు కాలేకపోతున్నాను అని ట్విట్ చేశారు.’ సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాదులో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. నందమూరి బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలనచిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు.