Nominated posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి మరోసారి ప్రారంభం అయ్యింది. ఎన్డీఏ పార్టీ నేతలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుకలు ఇవ్వనున్నారు. మూడు పార్టీల నేతలకు నామినేటెడ్ పదవులు అందించేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే బీజేపీతో పాటు జనసేన నుంచి ఆశావహుల జాబితాలు చంద్రబాబుకు అందాయి. ఇప్పటికే పవన్ తో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేందుకు తూది కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రెండు జాబితాలను ప్రకటించారు చంద్రబాబు.ఈసారి గతం కంటే ఎక్కువ పదవులు ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ రెండు జాబితాలో ఎక్కువ పదవులు టిడిపి వారే దక్కించుకున్నారు. ఈసారి మాత్రం తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు జనసేన,బిజెపి నేతలు. ఎమ్మెల్సీ పదవుల కోసం ఎక్కువగా పోటీ ఉంది. దీంతో ఎవరికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి? ఎవరిని నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయాలి అనేది సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
* సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం
పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పిఠాపురం వర్మ, దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఆశావాహులు అధికంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్న 60 కార్పొరేషన్ల పదవుల కోసం పోటీ విపరీతంగా ఉంది. అందులో ప్రధానంగా బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వీటితోపాటు అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్, నెడ్ క్యాప్, ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. కుల కార్పొరేషన్లకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి.
* ఆశావహులు అధికం
అయితే కూటమితో పాటు పార్టీల అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈసారి ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. టిడిపి ఆశావహుల్లో గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవి సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పేర్లు ఉన్నాయి. జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్లు ఖరారు అయినట్లు సమాచారం. బిజెపి నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు టిడిపి టికెట్ ఆశించారు. పొత్తులో భాగంగా వారికి దక్కలేదు. అటువంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.