Chandrababu On Amit Shaha: చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. బిజెపి అగ్ర నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ చర్చల సారాంశం ఏమిటి? ఇంతకీ పొత్తు ఉన్నట్టా? లేనట్టా? అన్నది మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. చంద్రబాబు సైతం క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు చంద్రబాబు అమిత్ షా తో ఏం చర్చించారు? అన్నది ఊహాజనిత ప్రశ్నగా మిగులుతోంది. కానీ దానిపై ఎల్లో మీడియా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించడం విశేషం. అందరూ అనుకున్నట్టు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది పొత్తు కోసం కాదని.. బిజెపితో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని చెప్పేందుకే వెళ్లారని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
గతంలో తెలుగుదేశం పార్టీకి మైనారిటీలు వెన్నుదన్నుగా నిలిచారు. బిజెపితో పొత్తు వల్ల అప్పట్లో దూరమయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. కానీ గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ అనుసరించిన విధానాలతో మైనారిటీలు ఇబ్బంది పడ్డారు. దీంతో వారంతా టిడిపి వైపు చూస్తున్నారు. ఇప్పుడు కానీ బిజెపితో పొత్తు పెట్టుకుంటే వారంతా దూరం అవుతారు. మళ్లీ వైసీపీకి దగ్గరవుతారు. అది తమకు రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని టిడిపి భయపడుతోంది. చంద్రబాబు ఇదే విషయంపై అమిత్ షా తో చర్చించారని బాబు భక్త పత్రిక కథనాన్ని రాసుకొచ్చింది.
వైసీపీ తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వెయ్యలేకపోయిందని.. దానివల్ల రాష్ట్రంలో చాలా వర్గాలు బాధితులుగా మిగిలారని.. అటువంటి వారంతా వైసిపి తో పాటు బిజెపి పై ఆగ్రహంగా ఉన్నారని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం చూపిన అలసత్వంతో విద్యావంతులు, మేధావులు, ఆలోచన పరులు ఆగ్రహంగా ఉన్నట్లు.. బిజెపితో పొత్తు పెట్టుకుంటే వీరంతా దూరమవుతున్నట్టు చంద్రబాబు అమిత్ షా కు వివరించినట్లు టాక్ నడుస్తోంది. బిజెపితో పొత్తు వల్ల తాము రాజకీయంగా నష్టపోతామని.. ఏపీ ప్రజలు తమను నమ్మరని.. అమిత్ షా ముఖం పైనే చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఎల్లో మీడియా చెబుతుండడం విశేషం. అయితే అదే సమయంలో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రానున్న బిజెపితో పొత్తు పెట్టుకోవడం అనివార్యమని చంద్రబాబు అన్నట్టు.. ఇదే ఎల్లో మీడియా మరో కథనాన్ని బయట పెట్టడం విశేషం. ఇలా ఎలా చూసుకున్నా ఒకవైపు బిజెపిని నమ్మిస్తూనే… మరోవైపు ప్రజల నుంచి తమ పొత్తుపై వ్యతిరేకత రాకుండా చంద్రబాబు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ బాధ్యతను ఎల్లో మీడియాకు అప్పగించారు. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.