Rajya Sabha by-election: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. డిసెంబర్ 3న షెడ్యూల్ వెల్లడించనుంది ఈసీ. వైసీపీ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. డిసెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే వైసీపీకి బలం లేకపోవడంతో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే టిడిపి రెండు ఎంపీ సీట్లను, జనసేనకు ఒకటి ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈసారి బిజెపికి ఛాన్స్ లేదని తెలుస్తోంది.
* నాగబాబుకి ఛాన్స్
జనసేనకు కేటాయించే సీటు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. జనసేన తరఫున నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు నాగబాబు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు నాగబాబు. జనసేన తో పాటు కూటమి గెలుపు కోసం గట్టిగానే పనిచేశారు. అందుకే ఈసారి నాగబాబుకు రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.
* తెరపైకి సుహాసిని
టిడిపికి సంబంధించి వ్యూహం మారినట్లు సమాచారం. నందమూరి కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తెలంగాణ టిడిపిలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఏపీ నుంచి ఈసారి పోటీ చేయిస్తారని ప్రచారం నడిచింది. కానీ అలా జరగలేదు.ఆమె జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు స్వయానా సోదరి. నందమూరి కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తే రాజకీయంగా టిడిపికి కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
* బిజెపి సైతం
అయితే తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వాలని బిజెపి బలంగా కోరుకుంటున్నట్లు సమాచారం. రెండు భాగస్వామ్య పార్టీలతో పాటు తమకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని బిజెపి కోరినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర బిజెపి నేతలకు ఛాన్స్ ఉంటుందా? లేకుంటే జాతీయ రాజకీయాలకు తగ్గట్టు మిగతా రాష్ట్రాల నేతలకు ఇక్కడ సర్దుబాటు చేస్తారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి మూడు ఎంపీ సీటుకు బిజెపి పట్టుపడుతుండడం విశేషం.