Chandrababu: ‘అమరావతి’ నిధుల సమీకరణకు చంద్రబాబు సరికొత్త ప్లాన్

అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రజలకు చాలా రకాలుగా హామీలు ఇచ్చారు.ఉచిత పథకాలను ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కీలక హామీలకు నిధులు భారీగా అవసరం. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి సైతం ప్రాధాన్యం ఇవ్వాలి.

Written By: Dharma, Updated On : June 29, 2024 10:08 am

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తమ మొదటి ప్రాధాన్యం అమరావతి, పోలవరం అని చెప్పకనే చెప్పారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరాన్ని సందర్శించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టునిర్మాణం పై రివ్యూ చేయనున్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు తేవడానికి గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. మరోవైపు అమరావతినిర్మాణం శరవేగంగా జరపాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. నిధుల కొరత లేకుండా చూసుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రజలకు చాలా రకాలుగా హామీలు ఇచ్చారు.ఉచిత పథకాలను ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కీలక హామీలకు నిధులు భారీగా అవసరం. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి సైతం ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ తరుణంలో కీలక ప్రాజెక్టులుగా ఉన్న అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి. వీటన్నింటికీ గుంప గుత్తిగా నిధులు కావాలి. కానీ కేంద్రం నుంచి కొన్ని పథకాల కి నిధులు వచ్చే అవసరం ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం నిధులు ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి వచ్చే ఛాన్స్ లేదు. దీంతో సొంతంగా నిధుల సమీకరణ కోసం కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి నిధులు సహకరించాలని భావిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతిలో నిర్మాణాల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు బ్యాంకుల నుంచి కూడా భారీగా రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా బ్యాంకుల నుంచి తీసుకుంటామంటే కుదిరే పని కాదు. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు పెట్టుబడుల అంశం ముందుకు వచ్చింది. నిధుల సమీకరణలో ఎన్నారైలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. వారి సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సింగపూర్, అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో తమ కార్యాలయాలను ప్రారంభించాలని పలు సాఫ్ట్ వేర్ కంపెనీలను కోరాలని నిర్ణయించింది. ఈ రెండింటి కోసం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో అమరావతిలో ఏపిఎన్ఆర్టి భవనానికి రాయపూడి వద్ద స్థలం కేటాయించారు. దాని ద్వారా కూడా ఇప్పుడు నిధులు సేకరణ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మరో పది రోజుల్లో సి ఆర్ డి ఏ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం నిధుల కోసం వేట ప్రారంభం కానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కనీసం 43 వేల కోట్లు అవసరం. వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చేనాటికి 15 రోజుల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. అందులో 9000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభమయ్యాయి కూడా. కొన్ని పూర్తయ్యాయి… మరికొన్ని మధ్యలో నిలిచిపోయాయి. ఇప్పుడు అమరావతిలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా.. కొత్త పనులు ప్రారంభించాలన్నా.. కనీసం పదివేల కోట్ల అవసరం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా నిధుల సమీకరణ చేయాలని చూస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.