Chandrababu Serious About Ministers: వైసిపి ప్రభుత్వ హయాంలో మంత్రులు చాలా యాక్టివ్ గా ఉండేవారు. అయితే అది శాఖల పరంగా కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరంగా. అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే.. ముందుగా మంత్రులు వాలిపోయేవారు. ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. చీల్చి చెండాడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే అది ముమ్మాటికి లేదనే చెప్పాలి. ఒకరిద్దరు మంత్రులు తప్పితే.. చాలామంది మౌనంగానే ఉంటున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో సైతం.. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. మెతక వైఖరి వద్దు అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. విధానపరమైన విమర్శలు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తాను వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళవద్దు అని మాత్రమే చెప్పానని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
* ఎరువుల కొరతపై ఎదురుదాడి..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కొరత కనిపిస్తోంది. వివిధ కారణాలతో ఈ ఏడాది ఎరువుల కొరత ఉంది. అయినా సరే ప్రభుత్వం సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. కిందిస్థాయి నేతల నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. కానీ ఏపీ మంత్రి వర్గం నుంచి దీనిపై కౌంటర్ ఇవ్వడం లేదు. దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే భయమా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తున్నామని.. దానిని చెప్పలేకపోతే ఎలా అంటూ చంద్రబాబు ప్రశ్నించేసరికి మంత్రులు ఆశ్చర్యపోయారు. అయితే శాఖల పరమైన టార్గెట్ విధించడంతోనే తాము రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్నామని మంత్రులు అంతర్గత సంభాషణలో ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఎప్పటికప్పుడు ప్రచారం
అయితే కొందరు మంత్రుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ప్రచారం బయటకు వస్తోంది. ఏకంగా ఓ అయిదుగురు మంత్రులను మార్చేస్తారని ఆ మధ్యన టాక్ నడిచింది. అయితే ఇప్పుడు కూడా మంత్రులపై సీరియస్ అనేది నిజమా కాదా అనేది నిర్ధారణ కావడం లేదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంగా అప్పుడు మంత్రులు ఉండేవారు. ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే దాడి చేసినంత పని చేసేవారు. కానీ శాఖపరమైన పనుల్లో మాత్రం వెనుకబడి ఉండేవారు. ఇప్పుడు మాత్రం శాఖాపరమైన పనుల్లో ముందుండే మంత్రులు.. రాజకీయ విమర్శలు చేయడంలో మాత్రం వెనుకబడి పోతున్నారు.