https://oktelugu.com/

Chandrababu Naidu : ఆ మాటలతోనే బతికేస్తున్న చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు..

చంద్రబాబు పరిస్థితి. తరాలు మారాయి తత్వాలు మారాయి.. కానీ చంద్రబాబు తీరు మారలేదు. తనకు తానే కీర్తించుకుంటున్నారు.తన హయాంలో bమాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు.

Written By: , Updated On : April 26, 2023 / 10:17 AM IST
Follow us on


Chandrababu Naidu :
పాడిందే పాడరా పాచిపళ్ల దసరా అన్నట్టుంది చంద్రబాబు పరిస్థితి. తరాలు మారాయి తత్వాలు మారాయి.. కానీ చంద్రబాబు తీరు మారలేదు. తనకు తానే కీర్తించుకుంటున్నారు.తన హయాంలో bమాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు. ఐటీ అభివృద్ధికి తానే అగ్రగణ్యుడిగా కితాబిచ్చుకుంటున్నారు. సమాచార విప్లవానికి నాంది పలికింది తానేనని చెబుతున్నారు. సైబరాబాద్ నిర్మించింది తానేనని.. ప్రస్తుత ఫలాల విత్తనాలు తనవేని చెప్పుకొస్తున్నారు. ఆయన ఐటీకి ప్రాధాన్యం ఇచ్చింది వాస్తవం. అభివృద్ధి చేసింది వాస్తవమే అయినా… పదే పదే చెప్పుకోవడం ద్వారా ప్రజలకు ఒకరకమైన తప్పుడు సంకేతం వెళుతోంది. ప్రత్యర్థులకు విమర్శనాస్త్రంగా మారుతోంది. సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. తాజాగా రిపబ్లికన్ టీవీ చర్చగోష్టి చంద్రబాబు ఎప్పుడో రెండున్నర దశాబ్దాల కిందట జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

మళ్లీ పాత కథే..
సైబరాబాద్ ఐటీ టవర్స్ కథను చంద్రబాబు మళ్లీ గుర్తుచేశారు. 28 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ఢిల్లీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన సమయం కోరాను. అతి కష్టమ్మీద పది నిమిషాలు ఇచ్చారు. నా ఆలోచనలను వివరిస్తుంటే ఆయన 45 నిమిషాలు నాతో గడిపారు. తన నుంచి ఏం కావాలని అడిగారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ కావాలని అడిగాను. తమకు అమెరికాలో తప్ప ఇటువంటి సెంటర్‌ లేదని, పెట్టాల్సి వస్తే ఇక్కడే పెడతానని హామీ ఇచ్చారు. అనేక సార్లు వెంటపడితే హైదరాబాద్‌లో పెట్టారంటూ మరోసారి పాత పాటనే పాడేశారు.

ఆ రోడ్లు తన పుణ్యమేనట..
దేశంలో సైతం ఐటీ అభివృద్ధికి తానే కారణమని చంద్రబాబు చెప్పారు. సైబరాబాద్ తరువాతఅనేక అమెరికన్ కంపెనీలు ఇండియాకు వచ్చాయని గుర్తుచేశారు. అంతటితో చంద్రబాబు ఆగలేదు. వాజ్ పేయ్ స్వర్ణ చతుర్భుజి పథకానికి సైతం తానే కారణమని చెప్పుకొచ్చారు. నేను మలేసియా వెళ్లినప్పుడు అక్కడ పెద్ద పెద్ద రహదారులు చూశాను. మన వద్ద కూడా వేద్దామని అప్పటి ప్రధాని వాజపేయిని కోరాను. డబ్బులెక్కడివని ఆయన ప్రశ్నించారు. ఒక విధానం రూపొందిస్తే టోల్‌గేట్ల ద్వారా ఆదాయం సంపాదించవచ్చని చెప్పాను.ఆ పద్ధతిలో మొదటి రహదారిని నెల్లూరు నుంచి చెన్నై వరకు వేశారు. ఇప్పుడు దేశమంతా జాతీయ రహదారులు విస్తారంగా నిర్మాణం అవుతున్నాయి.

ఎల్లో మీడియా ట్యాగ్ తోనే..
చంద్రబాబుకు ఎల్లో మీడియా ముచ్చటగా పెట్టుకున్న పేరు ఐటీ సృష్టికర్త. ఇందులో కొంత వాస్తవమున్నా.. చంద్రబాబు కంటే ముందే ఐటీ అభివృద్ధి జరిగింది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు ఐటీని అభివృద్ధి చేశారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో చంద్రబాబు అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. అటువంటి సమయంలో తనపై ఉన్న అపవాదు నుంచి ప్రజల దృష్టికి మరల్చేందుకు ఏదో కీలక అంశం కావాలి. అలా చంద్రబాబు మదిలో పురుడుబోసుకున్నదే ఐటీ. తరువాత డ్వాక్రా మహిళలు. ఈ రెండు అంశాలతోనే చంద్రబాబు తన నాయకత్వాన్ని పదిలపరుచుకున్నారు. అంతకంటే ముందే శంకుస్థాపన జరిగిన సైబరాబాద్ టవర్స్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి ఐటీ సృష్టికర్త అన్న నినాదాన్ని ఎల్లో మీడియా చంద్రబాబుకు ట్యాగ్ చేయడంలో సక్సెస్ అయ్యింది.