Jagan vs Chandrababu: ఏ ప్రభుత్వంలోనైనా తప్పులు జరగడం సహజం. ఎక్కడో ఓ చోట తప్పిదాలు జరుగుతుంటాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎమ్మెల్యేలు, మంత్రులు, క్రియాశీలక నేతలు తప్పులు చేస్తుంటారు. అవినీతితో పాటు పైరవీలు చేస్తుంటారు. అయితే ఇలా నేతల అవినీతి వెలుగులోకి వచ్చేటప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయి నేతలు చర్యలకు ఉపక్రమించాలి. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) కంటే చంద్రబాబు వంద రెట్లు నయం. తాజాగా ఏపీలో కల్తీ మద్యం ఘటన కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో డంప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే అది టిడిపి ముఖ్య నేత అనుచరుడిది అని తేలడం.. సదరు టిడిపి నేతపై ఆరోపణలు రావడంతో నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే గత వైసిపి ప్రభుత్వం లో ఇటువంటి ఆరోపణలు వచ్చిన చాలామంది నేతల విషయంలో చర్యలకు వెనుకడుగు వేశారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి.
ఇద్దరిపై సస్పెన్షన్ వేటు..
అన్నమయ్య జిల్లా( Annamayya district) తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జై చంద్రారెడ్డి తో పాటు సురేంద్ర నాయుడు అనే మరో నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు జయ చంద్రారెడ్డి. ఆయనకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు జయ చంద్రారెడ్డి. అయితే జయ చంద్రారెడ్డి అనుచరుడుగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావు మద్యం వ్యాపారి. ఈయనకు విజయవాడలో బార్ లైసెన్స్ ఉంది. కొన్ని మద్యం దుకాణాలను సైతం ఈయన సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో ములకల చెరువు అనే గ్రామంలో భారీగా నకిలీ మద్యం డంప్ పట్టుబడింది. ఓ 14 మంది పట్టుబడగా.. దీనికి సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు అని తేలింది. ఆ మరుక్షణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. జనార్దన్ రావు వెనుక జయ చంద్రారెడ్డి ఉన్నారని.. వీరి వెనుక లోకేష్ తో పాటు చంద్రబాబు ఉన్నారని సాక్షితోపాటు వ్యతిరేక మీడియాలో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. మద్యం వ్యాపారం కోసమే జయ చంద్రారెడ్డిని రంగంలోకి దించారని కూడా సాక్షి కథనం వండి వార్చింది.
ఉన్నత స్థాయి సమీక్ష..
అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు ఆదేశాల మేరకు జయ చంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులపై సస్పెండ్ వేటు వేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. కేవలం కల్తీ మద్యం కేసులో అభియోగాలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఎదురుదాడికి దిగకుండా తెలుగుదేశం పార్టీ తమ నేతల పైనే చర్యలకు దిగడం గమనార్హం.
అప్పట్లో చాలామంది పై..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. కారు డ్రైవర్ హత్య, మహిళలపై లైంగిక వేధింపులు వంటి అంశాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలకు దిగలేదు. వ్యతిరేక మీడియాలో పతాక శీర్షిక కథనాలు వచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. అయితే చంద్రబాబు అలా కాదు. గతంలో ఓ ఎమ్మెల్యే పై లైంగిక ఆరోపణలు రావడంతో వెంటనే వేటు వేశారు. ఇప్పుడు ఏకంగా ఓ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పై ఆరోపణలు రావడంతో వెనువెంటనే చర్యలకు ఉపక్రమించారు. అయితే చర్యలు తీసుకునే విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు.