Chandrababu Naidu: చంద్రబాబు పథకాల అమలుపై దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని పెంచారు. జూలై 1న విజయవంతంగా పంపిణీని పూర్తి చేశారు. మరోవైపు బోగస్ పింఛన్లపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు ఉన్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. వాటిని తొలగించి.. కొత్త హామీ మేరకు 50 సంవత్సరాలు దాటిన బీసీ లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. మరోవైపు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని వైఫల్యాలు, నిర్లక్ష్యం, అవినీతిని ప్రజలకు తెలియచెప్పేలా చూస్తున్నారు. రెండు నెలల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు.. శాశ్వత బడ్జెట్ ను పక్కన పెట్టారు. వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ ఈనెల 31 తో ముగియనుంది. దానినే మరో రెండు నెలల పాటు కొనసాగించడానికి డిసైడ్ అయ్యారు. ఇంతలో సంక్షేమ పథకాలను ట్రయల్ రన్ వేసి ఒక అంచనాకు రానున్నారు.
ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. మరోవైపు దుబారా ఖర్చును తగ్గించనున్నారు. అందులో భాగంగానే బోగస్ పింఛన్లను తగ్గించనున్నారు. తక్కువ వ్యయంతో కూడిన ప్రజాకర్షక పథకాలను తొలుత ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 183 క్యాంటీన్లను తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసేందుకు 20 కోట్ల రూపాయలతో మరమ్మత్తు పనులు చేయనున్నారు. ఈ క్యాంటీన్లకు సంబంధించి ఐఓటి డివైజ్లు, సాఫ్ట్ వేర్ అప్లికేషన్ కోసం ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు. 20 క్యాంటీన్లకు సంబంధించి కొత్త భవనాల నిర్మాణం తో పాటు పాత పెండింగ్ బిల్లుల చెల్లింపునకు 65 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటికి ఆహారం సరఫరా చేసే సంస్థల నుంచి టెండర్లు కూడా ఆహ్వానించారు. ఈ నెల 22 నాటికి ఖరారు చేయనున్నారు.
ఖజానాపై భారం పడకుండా పథకాలు అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూలై 1న సామాజిక పింఛన్ల పంపిణీని పూర్తి చేశారు. గత మూడు నెలల ఎరియర్స్ ను సైతం చెల్లించారు. ఒకటి రెండు తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలను సైతం చెల్లించారు.తన పాలనలో సగం సమయాన్ని అమరావతి, పోలవరం వంటి శాశ్వత ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రతి సోమవారం పోలవరం పై సమీక్షించనున్నారు. అటు కేంద్రం నుంచి సైతం భారీగా నిధులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ పాలనను కొనసాగిస్తూనే.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు హయాంలో తొలిసారిగా ఓటాన్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రాష్ట్ర ఆదాయ, వ్యయాలు… సంక్షేమ పథకాల భారం తదితర వాటిని పరిగణలోకి తీసుకోనున్నారు. వాటిపై ఒక ప్రాథమిక అంచనాకు రానున్నారు. అందుకు అనుగుణంగా వార్షిక బడ్జెట్ ను రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాల భారం.. సాధారణ పరిపాలన పై ప్రభావం చూపకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రం నుంచి భారీగా నిధులతో పాటు అపరిమిత అప్పులకు అనుమతులు వంటి వాటితో ఆర్థిక భారాన్ని అధిగమించాలని చూస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఒకవైపు.. అమరావతి రాజధానితో పాటు శాశ్వత పథకాలు మరోవైపు పూర్తిచేయాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయ్యారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.