CM Chandrababu: ప్రజలకు జగన్ అప్పుల చిట్టా.. చంద్రబాబు ‘శ్వేతా’స్త్రం

రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు ఉంచేందుకు చంద్రబాబు నిర్ణయించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లించాల్సిన బిల్లులపై నాలుగు స్వేత పత్రాలను విడుదల చేయనున్నారు.

Written By: Dharma, Updated On : June 17, 2024 10:36 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.బాధ్యతలు స్వీకరించారు.ఐదు ప్రధాన ఫైళ్లపై ఇప్పటికే సంతకాలు చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఫైల్ పై తొలి సంతకం చేశారు. పింఛన్ మొత్తం నాలుగు వేల రూపాయలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణన ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేశారు.డిసెంబర్లోగా ఇవన్నీ అమలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.అయితే సూపర్ సిక్స్ పథకాలతో పాటు మేనిఫెస్టో అమలు అంత ఆషామాషి విషయం కాదు. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.

రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు ఉంచేందుకు చంద్రబాబు నిర్ణయించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లించాల్సిన బిల్లులపై నాలుగు స్వేత పత్రాలను విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని చెబుతున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యవేక్షణలో శ్వేత పత్రాల రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎన్ని? ఎక్కడి నుంచి ఎంత రుణం తెచ్చారు? దేనికోసం ఖర్చు చేశారు? అన్న వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అవకతవకలను వెలికి తీయాలని ఆర్థిక శాఖ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు పదకొండు లక్షల కోట్లకు చేరిందని తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వం ఇందులో సగం మాత్రమే చేసినట్లు చెబుతుండగా.. వివిధ కార్పొరేషన్ల పేరుతో, ప్రభుత్వ ఆస్తుల తనకా రూపంలో తెచ్చిన రుణాలను వేరుగా చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో పాలన సజావుగా నడిపించేందుకు వీలు లేకుండా అడ్డగోలుగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది.జగన్ సర్కార్ వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లను ఉపయోగించుకొని రుణాలు తీసుకుందని.. ఆ అప్పులు ఇప్పుడు రాష్ట్రం మీద పెనుభారం మోపుతున్నాయని.. ఈ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేత పత్రాల ప్రయత్నమని తెలుస్తోంది.