Chandrababu: ఓ పేద ఎంపీ విషయంలో చంద్రబాబు సంచలనం

సాధారణంగా చంద్రబాబు అంటే కార్పొరేట్ స్థాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన పార్టీ శ్రేణుల ఆర్థిక స్థితిగతులను కూడా తెలుసుకుంటారని నిన్ననే తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

Written By: Dharma, Updated On : June 7, 2024 1:58 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు వెలుగు చూశాయి. సామాన్యులు సైతం ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. రంపచోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అంగన్వాడీ టీచర్ ఎన్నికయ్యారు. కొద్ది సంవత్సరాలుగా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థులే ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఈసారి అక్కడ పార్టీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు భావించారు. అంగన్వాడీ టీచర్ గా ఉన్న శిరీషా దేవిని రంగంలోకి దించారు. ఆమెకు అన్ని విధాలుగా ఆర్థిక వనరులు సమకూర్చారు. దీంతో ఆమె అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఒక సామాన్య అంగన్వాడీ టీచర్ ఎమ్మెల్యేగా మారారు. అటు విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశేట్టి అప్పలనాయుడు పరిస్థితి కూడా అదే. ఆయన ఓ సామాన్య నాయకుడు. ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే. కానీ ఆయన సీనియారిటీని, సిన్సియారిటీని మెచ్చి టిక్కెట్ ఇచ్చారు.అనూహ్యంగా అక్కడ నుంచి ఎంపీగా గెలిచారు అప్పలనాయుడు.

సాధారణంగా చంద్రబాబు అంటే కార్పొరేట్ స్థాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన పార్టీ శ్రేణుల ఆర్థిక స్థితిగతులను కూడా తెలుసుకుంటారని నిన్ననే తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారికి దిశ నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రాజెక్టులు, రాయితీల విషయంలో గట్టిగా పోరాటం చేయాలని కూడా పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. తనను తరచూ కలుసుకోవాలని.. ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా తేల్చి చెప్పారు. అయితే సమావేశం చివరిలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ను తన వద్దకు పిలిపించుకున్నారు చంద్రబాబు.

అప్పలనాయుడిది ఓ సాధారణ కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందున బొత్స కుటుంబ అడ్డాలో పోటీ చేశారు. రెండు లక్షల 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు కేడర్ గట్టిగానే ఫైట్ చేసింది. అటు అప్పలనాయుడు కమిట్మెంట్ సైతం చంద్రబాబుకు నచ్చింది. అందుకే ప్రత్యేకంగా అప్పలనాయుడును పిలిపించుకున్న చంద్రబాబు అభినందించారు. ఏం అప్పలనాయుడు ఫ్లైట్ టికెట్ తీసుకున్నావా? లేకుంటే మనవారికి ఎవరికైనా తీయమంటావా? అని చంద్రబాబు అనేసరికి అప్పలనాయుడు కళ్ళు చెమర్చాయి. అధినేత మాటలకు ఒక్కసారిగా ఫిదా అయిపోయారు అప్పలనాయుడు. వినమ్రతతో చంద్రబాబుకు నమస్కారం చేశారు. చంద్రబాబు దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. ఆత్మీయతను పంచారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.