Amaravati: అమరావతిపై చంద్రబాబు సర్కార్ స్కెచ్ మామూలుగా లేదుగా!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కీలక నిర్మాణాల వద్ద, రోడ్లకు ఇరువైపులా పెరిగిన ముళ్ళ పొదలను, చెత్తను తొలగించారు. దాదాపు 100 జెసిబి లతో శరవేగంగా పనులు చేయించారు. విద్యుత్ దీపాలను వెలిగించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాడు అమరావతి విద్యుత్ వెలుగులతో కళకళలాడింది. ఈ మార్పును చూసిన అమరావతి రైతులు పులకించుకుపోయారు.

Written By: Dharma, Updated On : July 10, 2024 11:42 am

Amaravati

Follow us on

Amaravati: అమరావతి : అమరావతికి వీలైనంత త్వరగా తుది రూపం తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా.. ఎక్కడా జాప్యం జరగకుండా చేయాలని చూస్తున్నారు. గతం మాదిరిగా ప్రకటనలు చేయకూడదని.. అప్పట్లో కట్టేస్తాం.. ఇప్పట్లో కట్టేస్తాం అన్న ఆర్భాటపు ప్రకటనలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఐకానిక్ నిర్మాణాల స్థితిగతులను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై ఒక నివేదిక వచ్చిన తర్వాత.. ప్రాథమికంగా కొన్ని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కీలక నిర్మాణాల వద్ద, రోడ్లకు ఇరువైపులా పెరిగిన ముళ్ళ పొదలను, చెత్తను తొలగించారు. దాదాపు 100 జెసిబి లతో శరవేగంగా పనులు చేయించారు. విద్యుత్ దీపాలను వెలిగించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాడు అమరావతి విద్యుత్ వెలుగులతో కళకళలాడింది. ఈ మార్పును చూసిన అమరావతి రైతులు పులకించుకుపోయారు. ఇక అమరావతి రాజధానిని అడ్డుకునే వారు లేరని వారిలో ధీమా కనిపించింది. అయితే అమరావతి వ్యాప్తంగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టడానికి, పచ్చదనం నింపడానికి, అన్ని నిర్మాణాలు అందుబాటులోకి తేవడానికి దాదాపు 39 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ ఖరారు చేయనున్నారు.

ముందుగా చాలా వరకు పూర్తయిన వివిధ వర్గాల నివాస గృహాలను పూర్తి చేయనున్నారు. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లతో కూడా ఇప్పటికే మాట్లాడారు.ఇక పనులు ప్రారంభించడమే మిగిలింది. ఐకానిక్ కట్టడాలకు సంబంధించి పునాదులు పూర్తయ్యాయి. వాటి స్థితిగతులను పరిశీలిస్తున్నారు. అందుకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా నిర్మాణాలు ప్రారంభించనున్నారు. 9 నెలల్లో ఉద్యోగులు, ఎమ్మెల్యేల నివాస గృహాలను వినియోగంలోకి తేనున్నారు. కేంద్ర సంస్థలకు కేటాయించిన స్థలాల్లో పొజిషన్లు చూపించనున్నారు. రోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నారు. 24 గంటల పాటు అమరావతిలో నిర్మాణాలు జరిగేలా చూడాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.వీలైనంత త్వరగా అమరావతికి తుది రూపం తేవాలని చూస్తోంది. అందులో సర్కార్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.