Chandrababu And Lokesh Foreign Tour: ఎంత పెద్దవారికైనా వారికంటూ ఒక కుటుంబం, జీవితం ఉంటుంది. అది కాదనలేని సత్యం కూడా. అయితే ప్రజా జీవితంలో ఉన్నవారు కుటుంబాలతో ఎక్కువ సమయం గడపలేరు. రాజకీయ పార్టీల అధినేతలు, ప్రభుత్వ అధినేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అటువంటివారు కుటుంబాలతో గడిపేది చాలా తక్కువ సమయం. అందుకే ఏడాదికి ఒకసారి.. ఆరు నెలలకు ఒకసారి కుటుంబాలతో ప్రశాంతంగా గడిపేందుకు విదేశాలకు వెళుతుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కార్యక్రమం ఉండనే ఉంటుంది. అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. దానిపై రాజకీయ ప్రత్యర్థులు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అది ఒక తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ విషయంలో మీడియా అతిగా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా అయితే లేనిపోని ప్రచారం చేస్తూ ఉంది.
* మారుతున్న ప్రాధాన్యతాంశాలు..
అయితే తెలుగు మీడియాలో( Telugu media) ప్రాధాన్యతాంశాలు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. ఒకసారి వారికి తప్పుగా అనిపిస్తుంది.. మరోసారి అదే ఒప్పుగా అనిపిస్తుంది. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. అంతకుముందే లోకేష్ తన భార్య, కుమారుడితో కలిసి విదేశాలకు వెళ్లారు. ప్రైవేట్ కార్యక్రమాల పేరిట తన కార్యాలయం నుంచి ఒక షెడ్యూల్ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి తో కలిసి ఆలస్యంగా బయలుదేరి విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు కూడా విదేశీ పర్యటన అంటూ క్లారిటీ ఇచ్చారు. సీఎంవో నుంచి ప్రకటన కూడా వచ్చింది. అయితే దీనిని రాజకీయం చేయాలని చూస్తోంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. అందులో ఏం తప్పు ఉందని మరో సెక్షన్ ఆఫ్ మీడియా చెబుతుండడం విశేషం. అయితే గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు వెళితే ఇదే మీడియా వ్యతిరేకించేది. అదే మీడియా మద్దతుగా ప్రచారం చేసేది. కానీ ఇప్పుడు రివర్స్ గా మారింది. ఎందుకంటే రాజకీయ ప్రాధాన్యత అంశాలు మారాయి కాబట్టి.
* ఏ రంగంలోనైనా సహజం..
ఏ రంగంలోనైనా బిజీగా ఉంటే వారు కొంత బడలిక తీర్చుకునేందుకు కుటుంబాలతో సహా పర్యటనలకు వెళుతుంటారు. కొంతమంది ఆలయాలను సందర్శిస్తారు. మరికొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్తారు. అలా వెళ్లిన క్రమంలో కొంత ప్రశాంతత లభిస్తుంది అన్నది వాస్తవం. ఈ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయితే కుటుంబంతో గడపకూడదా? ఈ రాష్ట్ర మంత్రి అయితే వ్యక్తిగత పర్యటనలకు వెళ్ళకూడదా? అలానే అన్నట్టు ఉంది మీడియా ప్రవర్తన. మీడియా హౌస్ లో పనిచేసేవారు, అధినేతలు వ్యక్తిగత పర్యటనలకు వెళ్ళరా? అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. దైనందిన జీవితంలో బిజీగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రశాంతత కోసం వ్యక్తిగత పర్యటనలకు వెళ్లడం సహజం. దానిని భూతద్దంలో చూపడం మాత్రం అసహజం.