AP Rain Alert: ఏపీకి శుభవార్త. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొంది. అల్పపీడనంగా మారిన అనంతరం 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కానీ వానల జాడలేదు. కనీసం అల్పపీడన ప్రభావంతో నైనా వర్షాలు పడితే ఖరీఫ్ పనులు ప్రారంభించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
బంగాళాఖాతం పశ్చిమ- మధ్య వాయువ్య దిశలో.. దక్షిణ ఒడిస్సా తీరం వెంబడి ఈ అల్పపీడనం ఏర్పడొచ్చు. దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడన ప్రభావంతో ఈ రాత్రి నుంచి చిరుజల్లులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో చెదురుమదు రు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది. క్రమంగా అవి ఉధృత రూపాన్ని ధరిస్తాయని.. ఈనెల 29 నాటికి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని కూడా అంచనా వేస్తోంది.