Site icon OkTelugu

Jagan: జగన్ పై కేంద్రం సీరియస్!

Jagan

Jagan

Jagan: రాష్ట్రాల రాజధానుల అంశం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం పై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోదు కూడా. అందుకే అమరావతి రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చినా కేంద్రం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అందరి ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. అయితే వైసిపి వచ్చిన తర్వాత అమరావతి పై స్టాండ్ మారింది. అయినా కేంద్రం కానీ.. ప్రధాని కానీ కలుగజేసుకోలేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పై మాత్రం కేంద్ర పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

* అప్పట్లో అలా..
2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం. అప్పట్లో బీజేపీ వైఖరిని విపరీతంగా వ్యతిరేకించారు చంద్రబాబు. దానిని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జగన్. ఎన్డీఏ లో నేరుగా వైసీపీ చేరలేదు కానీ అంతకుమించి ప్రయోజనం, స్వేచ్ఛ లభించింది జగన్మోహన్ రెడ్డికి. అయితే అమరావతి విషయంలో చంద్రబాబుకు క్రెడిట్ దక్కకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి భావన. అందుకే అమరావతి పై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి రాజకీయ కారణాలు అన్నది లేకపోలేదు. ఆపై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులపై కలుగజేసుకోకూడదు అనే నిబంధన కూడా ఉంది.

* రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా..
కానీ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది. రైల్వే తో పాటు రోడ్ల ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. 12 ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి భవనాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం అయింది. దాదాపు 50 వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం అని తేల్చి చెప్పారు. ప్రజలు తీర్పు స్పష్టంగా ఇచ్చిన.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. అందుకే కేంద్రం జగన్మోహన్ రెడ్డి తీరుపై సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Exit mobile version