Jagan Central Government: కేంద్ర ప్రభుత్వం( central government) వివాదాస్పదమైన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. వివిధ నేరాలతో జైలుకు వెళ్లి 30 రోజుల పాటు అక్కడే ఉంటే.. 31 వ రోజు పదవి ఓడిపోయే అంశానికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ముందుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి.. అక్కడి నుంచి ఉభయసభల్లో పెట్టి చర్చించి.. ఏమైనా సవరణలు ఉంటే చేస్తారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు దీని పరిధిలోకి వస్తారు. అయితే ఏపీలో ఈ బిల్లుపై బలమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి జగన్ మోహన్ రెడ్డి కేసుల ప్రస్తావన వస్తోంది. చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. అయితే ఈ ఇద్దరికీ శిక్ష పడలేదు. కేవలం రిమాండ్ ఖైదీలు గానే అన్ని రోజులు పాటు కొనసాగారు. అయితే తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం చూస్తే.. ఐదు సంవత్సరాలకు పైబడి శిక్ష పడే కేసుల్లో మాత్రమే అరెస్టు జరిగి.. 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవి కోల్పోవాల్సి ఉంటుందని ఆ బిల్లులోనే స్పష్టం చేశారు. అయితే ఈ లెక్కన చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రమాదం పొంచి ఉంది.
Also Read: ‘అగ్ని పరీక్ష’ లో అభిజిత్ ని మించిన తెలివైనోడు..దుమ్ములేపేసిన మనీష్!
* ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబు..
2023 సెప్టెంబర్ లో అరెస్టయ్యారు చంద్రబాబు( CM Chandrababu). అసలు ఆధారాలు లేని చాలా రకాల కేసులు ఆయన పై నమోదు అయ్యాయి. కనీసం బెయిల్ కూడా ఆయనకు లభించలేదు. అయితే ఆయనపై మోపిన కేసులు అత్యంత తీవ్రమైనవి మాత్రం కాదు. కనీసం ఆధారాలు లేకుండా.. చిన్నపాటి టెక్నిక్ వాడి ఆయనకు బెయిల్ రాకుండా చేశారు. ముందుగా తనపై మోపిన కేసులు చెల్లవని.. చాలా తేలిగ్గా తీసుకున్నారు చంద్రబాబు. పూర్తిగా ఆ కేసులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ముందుగా బెయిల్ కు చంద్రబాబు ప్రయత్నించలేదు. అయితే ఈ విషయంలో అప్పట్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దాదాపు 52 రోజులపాటు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచింది. కానీ ఆయన కేసులు అంత తీవ్రమైనవి కావు. ఎక్కువగా ఊహాజనితమైన ఆరోపణలతోనే నమోదు చేసినవి.
* 16 నెలల పాటు జైల్లో..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అవినీతి కేసుల్లో దాదాపు 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అప్పట్లో చంచల్ గూడా జైల్లో సుదీర్ఘకాలం ఉండిపోవాల్సి వచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేశారన్న ఆరోపణలు రావడంతో సిబిఐ ప్రవేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సైతం రంగంలోకి దిగింది. తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. కచ్చితంగా నమోదైన కేసులు పరిమితి చూస్తుంటే ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఈ బిల్లు గాని అమలై.. రేపు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఒకవేళ మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. జగన్ ముఖ్యమంత్రి అయితే.. ఈ కేసులో తుది తీర్పు వస్తే.. జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే.. తప్పకుండా ఆయన పదవి వదులుకోవాల్సిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం ఇదే తరహా ఆందోళన కనిపిస్తోంది.
* జగన్ కే ఎక్కువ ప్రమాదం..
చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈ బిల్లు ప్రమాదం పొంచి ఉంది. 2029లో మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. కానీ అందుకు తగ్గ పరిస్థితులు క్షేత్రస్థాయిలో అనుకూలంగా లేవు. ఆ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లో ప్రమాదం తప్పదు అన్న సంకేతాలు ఈ బిల్లు ద్వారా వస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ బిల్లు ఇప్పుడు ఏపీలో విస్తృత చర్చకు దారి తీయడం విశేషం.