TTD  Laddu Controvercy : టీటీడీ లడ్డూవివాదంపై రంగంలోకి కేంద్రం.. సీరియస్ చర్యలు షురూ

ఏపీలో హిందూ సనాతన ధర్మంపై ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని బిజెపి ఎప్పటినుంచో చెప్పుకొస్తోంది. టీటీడీలో అన్య మత ప్రమేయం అధికమైందని.. టీటీడీ చైర్మన్ల నియామకం పై సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తోంది బిజెపి.

Written By: Dharma, Updated On : September 20, 2024 5:41 pm

TTD Laddu Controvercy

Follow us on

TTD  Laddu Controvercy :  తిరుమల లడ్డూ వివాదం వేళ… దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి సైతం భక్తులు రియాక్ట్ అవుతున్నారు. నాటి వైసిపి ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. మరోవైపు బిజెపి కొత్త స్లోగన్ అందుకుంది.గతంలో తాము లేవనెత్తిన సందేహాలను గుర్తు చేస్తోంది. తిరుపతిలో అన్యమత ప్రచారంతో పాటు టీటీడీ చైర్మన్ల నియామకంపై గతంలోనే బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంత లైట్ తీసుకున్నారు. ఇప్పుడు లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు నూనె కలిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెను వివాదానికి దారితీసింది. ముఖ్యంగా వైసిపి ప్రభుత్వంతో పాటు అప్పటి టీటీడీ చైర్మన్ ల పాత్ర పై విమర్శలు వస్తున్నాయి. అన్య మతస్తులను టీటీడీ చైర్మన్లుగా నియమించడమే ఇటువంటి ఘటనలకు కారణమని బిజెపి ఆరోపిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి ఒకరు స్పందించారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

* తొలుత వైవి సుబ్బారెడ్డి పై
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. అక్కడకు కొద్ది రోజులకే టీటీడీ చైర్మన్ గా తన సమీప బంధువు,బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు.అయితే అప్పటికే జగన్ క్రిస్టియన్ గా ఉండడంతో.. వై వి సుబ్బారెడ్డి పై కూడా అనుమానాలు తలెత్తాయి. ఆయన హిందువు కాదని… క్రిస్టియానిటీని స్వీకరించారని ప్రచారం జోరుగా సాగింది. అలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటంటే సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే లేచింది. అటు తరువాత తన మతం పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి. తనతో పాటు భార్య హిందువని.. తామెప్పుడు క్రిస్టియానిటీ స్వీకరించలేని విషయాన్ని ప్రస్తావించారు. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

* కరుణాకర్ రెడ్డి నియామకంపై
ఎన్నికలకు ముందు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి పై సైతం అన్యమత ఆరోపణలు వచ్చాయి. ఆయన క్రిస్టియన్ అని.. కుమార్తెకు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేశారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అటు తరువాత ఈ వివాదంపై కరుణాకర్ రెడ్డి స్పందించారు. తాను అసలు సిసలైనా హిందువునని.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటికే 17 సంవత్సరాలకు ముందే తాను టీటీడీ అధ్యక్ష పదవి చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. దయచేసి తనపై దుష్ప్రచారం చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశానికి సంబంధించి కూడా వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

* కేంద్ర మంత్రుల హాట్ కామెంట్స్
మరోవైపు లడ్డూల వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రులు వైసీపీ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరందలజే స్పందించారు. టీటీడీ బోర్డు చైర్మన్లుగా, సభ్యులుగా హిందువులు కాని వారిని నియమించాలని గుర్తు చేశారు. అందుకే లడ్డూల తయారీలో అపవిత్రం జరిగిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి చుట్టూ జరుగుతున్న హిందూ వ్యతిరేక రాజకీయాల వలన.. మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ వివాదం పై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతోంది.