YS Jagan : జగన్ కు సిబిఐ షాక్.. విదేశీ పర్యటనకు నో పర్మిషన్.. మరో వారం ఆగాల్సిందే!

సిబిఐ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ప్రస్తుతం జగన్ బెయిల్ పై ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. కానీ ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతున్నందున.. జగన్ విదేశీ పర్యటన పై సిబిఐ అభ్యంతరాలు చెబుతోంది.

Written By: Dharma, Updated On : August 21, 2024 4:49 pm

YS jagan

Follow us on

YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ కు సిబిఐ అధికారులు షాక్ ఇచ్చారు.ఇన్ని రోజులు మినహాయింపులు దక్కించుకున్న జగన్.. అధికారం కోల్పోయేసరికి ఆ చాన్స్ లేకుండా పోయింది. తాజాగా విదేశీ పర్యటన కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు జగన్.లండన్ లో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు వెళ్లాలని విన్నవించుకున్నారు.అయితే దానిపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని సూచించింది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.2019 సీఎం అయ్యే వరకు ఆయన ప్రతి శుక్రవారం కోర్టులో జరిగే విచారణకు హాజరయ్యేవారు.సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు హాజరు నుంచి మినహాయింపు లభించింది.జగన్ విదేశాలకు వెళ్తే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో లండన్ లో చదువుకుంటున్న తన కూతురిని కలిసేందుకు కోర్టు అనుమతి కోరారు జగన్. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోరింది. బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా పెండింగ్లో ఉందని.. కేసు విచారణ చాలా ఆలస్యం అవుతుందని సిబిఐ కోర్టుకు చెప్పింది. వాదనలు విన్న సిబిఐ కోర్టు ఈనెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది. దీంతో జగన్ కు కొత్త టెన్షన్ ప్రారంభమైంది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతిస్తుందా? లేదా అన్న అనుమానం మొదలైంది.

* కోర్టుల్లో ప్రత్యేక పిటిషన్లు
ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పై కోర్టుల్లో ప్రత్యేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటికే విచారణ సైతం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అదే అంశాన్ని లేవనెత్తి.. జగన్ విదేశాలకు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుండడం విశేషం. అయితే గతంలో విదేశాలకు వెళ్లే సమయంలో ఇట్టే అనుమతులు లభించేది. కానీ ఇప్పుడు న్యాయస్థానంలో జాప్యం జరుగుతుండడం పై జగన్ లో టెన్షన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

* విజయసాయి రెడ్డికి సైతం
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. దీనిపై కూడా ప్రత్యేక కోర్టులో వాదనలు సాగాయి. విజయసాయి రెడ్డి తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. యూరప్ లో వచ్చే నెల ఆరు నుంచి రెండు నెలల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. గతంలో విజయసాయి రెడ్డికి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చినందున.. ఇప్పుడు కూడా అనుమతులు ఇవ్వాలని కోరారు.

* వారం రోజులు ఆగాల్సిందే
అయితే విజయసాయి రెడ్డి విషయంలో సైతం సీబీఐ అభ్యంతరాలు తెలిపింది. ఇప్పటికే కేసు విచారణలో జాప్యం జరిగిందని.. ఎట్టి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. దీంతో కోర్టు స్పందించింది. ఇరువాదనలు వినింది.విచారణను ఈనెల 30 కి వాయిదా వేసింది.దీంతో వీరి విదేశీ పర్యటన ఖరారు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరో వారం రోజులపాటు ఎదురుచూపులు తప్పడం లేదు.