Amaravathi Cases : తన ప్రాధాన్యత ప్రాజెక్టు అమరావతి అని చంద్రబాబు తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఫుల్ ఫోకస్ పెట్టారు. గత ఐదేళ్లుగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన అమరావతి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాణం పోసుకుంది. చకచకా పనులు ప్రారంభమయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను 33 కోట్ల రూపాయలు కేటాయించారు. శాశ్వత నిర్మాణాలకు సంబంధించి నిధుల కొరత ఉన్నా.. ఏదో విధంగా సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా సాయం పొందాలని చూస్తున్నారు. అయితే అమరావతి పై దృష్టి పెట్టిన చంద్రబాబు.. న్యాయపరమైన చిక్కులపై ఇంతవరకు ఫోకస్ పెట్టలేదు.
వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్న క్రమంలో అమరావతి రైతులు భారీ ఉద్యమానికి తెర తీశారు. న్యాయస్థానాల్లో భారీగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో కోర్టులు సైతం అమరావతి రాజధాని అని తేల్చి చెప్పాయి. ఈ తీర్పు రాకముందే రాజధాని బిల్లులను అసెంబ్లీలో జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది. అటు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడ రాజధాని వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. కేసు అలానే పెండింగ్ లో ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో రాజధానుల కేసులు వెనక్కి తీసుకుంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తోంది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. కానీ రాజధానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు ప్రయత్నాలు జరగకపోవడం విశేషం. కనీసం దాని గురించి చర్చలు కూడా జరగడం లేదు. అలాగే అసెంబ్లీలో రాజధాని బిల్లులు తిరిగి ప్రవేశపెడతామని కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. న్యాయపరమైన వివాదాలు పట్టించుకోకుండా.. కేవలం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందా? అన్న చర్చ జరుగుతోంది.
ఏపీలో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. కనీసం వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కలేదు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే 134 స్థానాల్లో విజయం సాధించింది. సుస్థిర ప్రభుత్వంతో ఐదేళ్లపాటు ముందుకు సాగనుంది.అందుకే కోర్టు వివాదాలు తర్వాత చూసుకోవచ్చన్న ధీమాతో ఉంది. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరపాలని మాత్రం చూస్తోంది. అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తుందన్న ధీమా కూడా కనిపిస్తోంది. చేతిలో అధికారం ఉంది కనుక.. విపక్షం బలహీనంగా ఉండడంతో.. ఎటువంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.అందుకే ఈ కేసులను కూడా పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
ప్రస్తుతంరాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అన్ని విధాల అండగా నిలుస్తామని ఇప్పటికే చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు సైతం రాజకీయ అంశాల కంటే.. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. అమరావతి నిర్మాణం చేపడితేనే కూటమికి ఏపీ ప్రజలు నమ్ముతారని..లేకుంటే తమతో పాటు బిజెపికి కూడా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చంద్రబాబు కేంద్ర ప్రజలకు చెప్పినట్లు సమాచారం.దీనిపై కేంద్ర పెద్దల సైతం సానుకూలత వ్యక్తం చేశారని.. వీలైనంత త్వరగా అమరావతి పనులు పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టాలని కేంద్రం నుంచి చంద్రబాబుకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండడం, రాష్ట్రంలో ఏకపక్ష విజయం సాధించి ఉండడంతో.. న్యాయపరమైన చిక్కులు ఇట్టే అధిగమించవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కేసుల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Capital cases not recognized in the ap governament
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com