Graduate MLC Election : ఏపీలో మరో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే మార్చిలో కృష్ణా- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో.. ఆ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థులు బరిలో దిగనున్నారు. అయితే ఆ రెండు స్థానాల నుంచి టిడిపి అభ్యర్థులే పోటీ చేయనున్నారు. టిడిపి నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మిగతా రెండు పార్టీలు వెనక్కి తగ్గాయి. టిడిపి అభ్యర్థులకే మద్దతు తెలపనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాలుగు జిల్లాలకు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాలని ఆదేశించారు. అయితే నాలుగు నెలల కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని వైసిపి ఆరోపిస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొస్తోంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తుండడంతో వైసిపి గట్టిగా ప్రయత్నిస్తే గెలిచే ఛాన్స్ ఉంది కదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఈ నాలుగు జిల్లాల్లో వైసీపీ బలహీనంగా ఉంది. దీనికి తోడు ఆ పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్తున్నారు. కేవలం కూటమి ప్రభుత్వంపై పతాకస్థాయిలో వ్యతిరేకత ఉంటేనే పట్టబద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. అంతకుమించి మరో పరిస్థితి ఉండదు. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైసీపీ సైలెంట్ గా ఉంటుంది. కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరెడ్డిని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా ఖరారయ్యారు. ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ నుంచి ఎలాంటి ప్రయత్నాలు ప్రారంభం కాలేదు.
* వైసీపీకి గోల్డెన్ చాన్స్
కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని వైసీపీ చెబుతోంది. అదే జరిగితే వైసీపీకి ఇది గోల్డెన్ చాన్స్. సాధారణ ప్రజలకంటే పట్టభద్రులు ప్రభుత్వం పనితీరును గమనిస్తుంటారు. కచ్చితంగా ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటే.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. గత ఏడాది మార్చిలో జరిగింది ఇదే. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంతో పాటు రాయలసీమలోని రెండు స్థానాలను కైవసం చేసుకుంది టిడిపి. అక్కడినుంచి వైసిపి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికలను వైసీపీ తేలిగ్గా తీసుకుంది. తమకు ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉందని చెప్పుకొచ్చింది.అప్పుడే అలర్ట్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అయితే అప్పట్లో టిడిపికి వచ్చిన ఛాన్స్ ఇప్పుడు వైసీపీకి వచ్చింది. మరి ఏ మేరకు వైసిపి వ్యవహరిస్తుందో చూడాలి.
* ఆ వ్యతిరేకత ఉందా
అయితే అప్పట్లో టిడిపికి వచ్చిన ఛాన్స్, అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. అప్పట్లో వైసీపీపై పతాక స్థాయిలో వ్యతిరేకత ఉండేది. అప్పటికే నాలుగేళ్ల పాలన వైసీపీ పూర్తి చేసుకుంది. ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి అది తగిన సమయము. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దృష్ట్యా.. తమకు తిరుగు లేదని వైసీపీ భావించింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అది గమనించలేదు వైసీపీ. ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. ప్రభుత్వ పనితీరు తెలుసుకునేందుకు ఈ సమయం చాలదు. కనీసం ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన తర్వాత అయినా ఒక అంచనాకు వస్తారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రారంభ దశలో ఉండడంతో.. గతంలో టిడిపి మాదిరిగా పట్టభద్రుల స్థానాలను గెలిచేస్తామంటే కుదిరే పని కాదు. పైగా కూటమి దూకుడుగా ఉంది. వైసిపి బలహీనంగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఛాన్స్ లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Can the ycp cash in on the opposition to the government in the graduate mlc elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com